Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్చరించిన 200కి పైగా ఎన్జీఓలు
- అంతర్జాతీయ నిర్ణయాత్మక కార్యాచరణ అవశ్యమని స్పష్టీకరణ
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు సంభవిస్తున్నట్లు అంచనా వేయబడిందని 200కి పైగా ఎన్జీఓలు మంగళవారం హెచ్చరించాయి. అడ్డూ అదుపు లేకుండా పోతున్న ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని సమూలంగా నిర్మూలించాలంటే అంతర్జాతీయంగా నిర్ణయాత్మకమైన కార్యాచరణ అవసరమని ఆ సంస్థలు కోరాయి. ''ఆకాశన్నంటుతున్న క్షుద్బాధ స్థాయి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 75దేశాలకు చెందిన సంస్థలు బహిరంగ లేఖపై సంతకాలు చేశాయి.'' అని ఆ ఎన్జిఓలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ఆకలి బాధను ఎదుర్కొంటున్నారని హెచ్చరిస్తూ, 2019 తర్వాత ఈ సంఖ్య రెట్టింపు కన్నా పెరిగిందని ఆ ప్రకటన పేర్కొంది. 21వ శతాబ్దంలో కరువు కాటకాలు నెలకొనడాన్ని అస్సలు అనుమతించేది లేదని ప్రపంచ నేతలందరూ హామీల వర్షం గుప్పించారు కానీ వాస్తవానికి అందుకు విరుద్ధంగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు. సోమాలియాలో మళ్ళీ కరువు రక్కసి కోరలు చాస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో దాదాపు 5కోట్ల మంది ప్రజలు ఆకలి చావుల అంచున వున్నారని తెలిపారు. ప్రతి రోజూ ఆకలితో దాదాపు 19,700 మంది చనిపోతున్నట్లు అంచనా వేశారని, అంటే ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు చనిపోతున్నారని ఎన్్జీఓలు అందోళన వ్యక్తం చేశాయి. ''ఈనాడు వ్యవసాయ రంగంలో, పంట దిగుబడుల టెక్నిక్ల్లో సాంకేతికత పెరిగినా, 21వ శతాబ్దంలో మనం ఇంకా కరువు కాటకాలు గురించి మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గు చేటైన విషయమని బహిరంగ లేఖపై సంతకాలు చేసిన సంస్థల్లో ఒకటైన యెమెన్ ఫ్యామిలీ కేర్ అసోసియేషన్‌కి చెందిన మొహన్నా అహ్మద్ అలీ ఎల్జాబలీ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ''ఇది కేవలం ఒక దేశానికి లేదా ఒక ఖండానికి సంబంధించిన సమస్య కాదు, అలాగే ఆకలి ఒక్కటే కూడా కారణం కాదు. మొత్తంగా మానవాళికి జరుగుతున్న అన్యాయం ఇది.'' అని ఆయన వ్యాఖ్యానించారు. ''ప్రజలు తమ గురించి, తమ కుటుంబాల భవిష్యత్ గురించి ఆలోచించుకుని, అవసరమైనవి సమకూర్చుకోవడానికి గానూ తక్షణమే ప్రాణాధారమైన ఆహారాన్ని, దీర్ఘకాలిక తోడ్పాటును అందించడంపై దృష్టి కేంద్రీకరించడానికి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయరాదు.'' అని ఎన్జీఓలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.