Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 73మంది వలసదారులు మృతి
డమాస్కస్ : మధ్యధరాసముద్రంలో సిరియా తీరంలో గురువారం బోటు మునగడంతో 73మంది వలసదారులు మరణించారని మరో 20మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సిరియా ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం తెలిపారు. వీరందరూ లెబనాన్లో బోటు ఎక్కారు. బోటులో మొత్తంగా 150మంది వరకు వున్నారని, వారిలో ఎక్కువమంది లెబనాన్, సిరియా జాతీయులేనని చెప్పారు. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ప్రమాదంగా దీన్ని భావిస్తున్నారు. 2019 నుండి లెబనాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ నుండి ఇతర దేశాలకు అక్రమ వలసలు ఎక్కువయ్యాయి. దేశాన్ని వీడి సిరియా, పాలస్తీనా శరణార్ధులుగా రావడానికి లెబనాన్ జాతీయులు ఎక్కువగా ప్రయత్నించే క్రమంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తర లెబనాన్ ఓడరేవు నగరమైన ట్రిపోలీకి 50కిలోమీటర్ల దూరంలో వుండే సిరియా ఓడరేవు పట్టణమైన టార్టస్ తీరంలో ఈ ప్రమాదం సంభవించింది. మిగిలినవారి కోసం గాలింపు పెద్ద ఎత్తున జరుగుతోందని, అయితే సముద్రంలో వచ్చే పెద్ద పెద్ద అలల కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని సిరియా రవాణా మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన లెబనాన్ జాతీయుల మృత దేహాలను స్వదేశానికి రప్పించేందుకు చర్చలు జరుపుతున్నట్లు లెబనాన్ అధికారులు తెలిపారు.