Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి మహిళా ప్రధానిగా మెలోనీ
రోమ్ : ఇటలీ సార్వత్రిక ఎన్నికల్లో జార్జియా మెలోనీ నేతృత్వంలోని మితవాద సంకీర్ణ కూటమి విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల తొలి ఫలితాలను హోం శాఖ సోమవారం విడుదల చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ స్పష్టమైన మెజారిటీ దిశగా కూటమి పయనిస్తోందని హోం శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇటలీ మొదటి మహిళా ప్రధానిగా మెలోనీ బాధ్యతలు చేపట్టనున్నారు. మెలోని నేతృత్వం వహిస్తున్న బ్రదర్స్ ఆఫ్ ఇటలీ (ఎఫ్ఐ) పార్టీ 26శాతం ఓట్లతో ఆధిక్యంలో వుండగా, ప్రధాన సెంటర్ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ఆ పార్టీకి 19శాతం ఓట్లు లభించాయి. మితవాద సంకీర్ణంలోని ఇతర భాగస్వామ్య పార్టీలైన మాటో సాల్విని లీగ్‌కి 9శాతం, మాజీ ప్రధాని సిల్వియో బెర్లూస్కోని పార్టీకి 8శాతం ఓట్లు లభించాయి. ఇప్పటికి 90శాతానికి పైగా ఓట్లను లెక్కించారు. మారియో ద్రాగి సంకీర్ణ ప్రభుత్వం జులైలో కుప్పకూలిన తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తంగా 64శాతం ఓట్లు పోలయ్యాయి. మెలోనీ ఇప్పటికే విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. ''ఇటలీ మమ్మల్ని ఎంచుకుంది. మేం దేశాన్ని మోసం చేయం.'' అని ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఇటలీతో సహా ఇయు దేశాలు మొత్తంగా సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని అన్నారు.