Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరణార్థి శిబిరాలపైకి సైనిక వాహనాలు
- ముగ్గురు పాలస్తీనియన్ల మృతి
రమల్లా : ఉత్తర వెస్ట్ బ్యాంక్ నగరమైన జెనిన్లో బుధవారం నాడు ఇజ్రాయిల్ సైనికులు అమానవీయ రీతిలో దాష్టీకానికి పాల్పడింది. జెనిన్లోని శరణార్థుల శిబిరంపై సాయుధ వాహనాలతో ఇజ్రాయిల్ బలగాలు ఒక్కసారిగా దూసుకుపోయాయి. ఈ దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..ఇజ్రాయిల్ బలగాలు జెనిన్ నగరంపై ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డాయి. ఉధృతంగా అన్ని వైపుల నుండి కాల్పులు జరిపారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించి అక్కడి ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. టెల్ అవీవ్ నగరంలో ఏప్రిల్లో జరిగిన దాడిలో మరణించిన రయీద్ హజీమ్ తండ్రి వుంటున్న ఇంటిని కూడా ఇజ్రాయిల్ సైనికులు చుట్టుముట్టారు. హజీమ్ ఇంటిపై క్షిపణుల వర్షం కురిసింది. హజీమ్ ఇంటిని ధ్వంసం చేసేందుకు జెనిన్ నగరంలో ఇజ్రాయిల్ బలగాలు మిలటరీ కార్యకలాపాలు చేపట్టాయని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి తెలిపారు. గత కొద్ది మాసాలుగా వెస్ట్ బ్యాంక్లో ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. జనవరి నుండి ఇప్పటివరకు ఇజ్రాయల్ సైనికుల చేతుల్లో 90 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో పిల్లలు, మహిళలు వున్నారు. పాలస్తీనా పక్షం జరిగిపన కాల్పుల్లో 18 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు.