Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ సమాజానికి ఐరాస పిలుపు
- చైనా 'అభివృద్ధి' ప్రతిపాదనకు ప్రశంసలు
న్యూయార్క్ : వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడంలో సాయమందించా ల్సిందిగా ఆయా దేశాలకు చెందిన నేతలు, సీనియర్ ప్రతినిధులు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశాల్లో వర్ధమాన దేశాలకు చెందిన పలువురు నేతలు మాట్లాడుతూ, అభివృద్ధి ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. చైనా ప్రతిపాదించిన అంతర్జాతీయ అభివృద్ధి చొరవ (గ్లోబల్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్-జిడిఐ)ని వారు ప్రశంసించారు. ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనడానికి ఈ ప్రతిపాదన చాలా ఉపయోగపడుతుందన్నారు.మొరాకో ప్రధాని అజీజ్ అకనౌచ్ మాట్లాడుతూ, ప్రస్తుత భౌగోళిక, రాజకీయ సంక్షోభాల ప్రభావాలకు ఆఫ్రికా ఖండం బాగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఆహార, ఇంధన ధరల భారంతో సుస్థిర అభివృద్ధి ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంద న్నారు.సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫాస్టిన్ ఆర్చేంజ్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో తలెత్తిన భద్రతా, ఆరోగ్య సంక్షోభాల కారణంగా దేశాభివృద్ధి మందగించిందని అన్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా ఆర్థిక తోడ్పాటు కూడా కొరవడిందని, ఫలితంగా వ్యవసాయం, గనుల తవ్వకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. అయితే ఎన్ని క్లిష్ట పరిస్థితులెదురైనా వాటిని అధిగమించి, అబివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వడానికి కట్టుబడి వున్నామని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో వర్ధమాన దేశాలకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా వారు అంతర్జాతీయ సమాజాన్ని ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. లావో డిప్యూటీ ప్రధాని సేలమక్సే కొమసిత్ మాట్లాడుతూ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి, సవాళ్ళను వివరిస్తూ తమ ప్రభుత్వం రెండు జాతీయ సమీక్షలను అందచేసిందని చెప్పారు. పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మారపె మాట్లాడుతూ, ప్రస్తుతమున్న అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య వ్యవస్థ వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగానే వుందని అంటూ వ్యవస్థాగత మార్పు రావాలని కోరారు. ఇథియోపియా, అర్జెంబైనా, సాల్మన్ దీవుల నేతలు కూడా మాట్లాడారు. అందరికీ ప్రయోజనం కలిగించే రీతిలో అభివృద్ధి చర్యలు వుండాలని, అందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరారు. ఆహార కొరతలతో, వాతావరణ మార్పులతో, అరకొర నిధులతో తీవ్రంగా సతమతమవుతున్న వర్ధమాన దేశాలకు జిడిఐ అనేది సరైన ప్రతిపాదన అని జి 77 ఛైర్పర్సన్ మునీర్ అక్రమ్ పేర్కొన్నారు.