Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యునెస్కోను కోరిన వెనిజులా
కారకస్: ఇతర దేశాలు విధించే ఆంక్షల వల్ల ఎదురయ్యే ప్రమాద కరమైన ప్రభావం నుంచి ప్రజల సాంస్కృతిక హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా యునెస్కోను వెనిజులా సాంస్కృతిక శాఖ మంత్రి ఎర్నెస్టో విలేజెస్ కోరారు. ఏకపక్షంగా తీసుకునే బలవంతపు చర్యల నుంచి ప్రజల సంస్కృతీ హక్కులను, వారి వారసత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడే యంత్రాంగాన్ని యునెస్కో అందించాలని ఆయన కోరారు. మెక్సికో సిటీలో జరిగిన యునెస్కో సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక విధానాలు, స్థిరమైన అభివృద్ధిపై ఈ సమావేశం జరిగింది. ఆంక్షలు సమాజాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కేవలం లాటిన్ అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వీటి ప్రభావం వుంటుందన్నారు. గణాంకాలను చూసినట్లైతే మానవాళిలో దాదాపు సగభాగం ఆంక్షలకు గురవుతున్నారని అన్నారు. ప్రపంచ ప్రజా ప్రయోజనంగా సంస్కృతిని అధికారికంగా గుర్తించాలన్న యునెస్కో లక్ష్యానికి వెనిజులా మద్దతిస్తుందని చెప్పారు. అమెరికా విధించే ఆంక్షలతో వెనిజులన్లపై సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం వుంటోందని వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది.