Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మంది మృతి, 27మందికి గాయాలు
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఒక విద్యా సంస్థపై ఆత్మాహుతి బాంబర్ దాడి చేయడంతో 19మంది మరణించారు. మరో 27మంది గాయపడ్డారు. పశ్చిమ కాబూల్‌లోని దష్త్-ఇ-బర్చి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ పేలుడు సంభవించిందని పోలీసు ప్రతినిధి ఖలీద్ జర్దాన్ తెలిపారు. ఈ ప్రాంతంలో షియా ముస్లింలు అధికంగా వుంటారు. స్కూలుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగే సమయానికి విద్యార్ధులంతా పరీక్షకు సిద్ధమవుతున్నారని ఆయన చెప్పారు. రక్తమోడుతున్న విద్యార్ధులు, చెల్లాచెదురుగా పడిన మృత దేహాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా, బీభత్సంగా వుందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఫోటోల ద్వారా తెలుస్తోంది. కజ్ ఎడ్యుకేషన్ సెంటర్లో విద్యార్ధులంతా ప్రాక్టీస్ యూనివర్శిటీ ఎంట్రన్స్ పరీక్ష రాస్తుండగా ఈ దుర్ఘటన సంభవించిందని జర్దాన్ తెలిపారు. సాధారణంగా శుక్రవారాలు ఆఫ్ఘనిస్తాన్‌లో పాఠశాలలు మూసివేస్తారు. కానీ ఎంట్రన్స్ పరీక్ష కోసం పిల్లలు సన్నద్దమవుతుండడంతో ఈ స్కూలు తెరిచివుంది. పౌర లక్ష్యాలపై ఇలా భీతావహంగా దాడులు చేయడం వారి అమానవీయతను తెలియచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వారికి నైతిక విలువలు కూడా లేవని దీంతో అర్ధమవుతోందని అన్నారు. తరగతి గదిలో దాదాపు 600మంది విద్యార్ధులు వున్నారు. కానీ మరణించిన వారిలో ఎక్కువమంది బాలికలే వున్నారని చెప్పారు. కాగా, ఇంతవరకు ఈ దాడికి తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించలేదు. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు అక్కడకు చేరుకున్నాయి. వార్త తెలిసిన వెంటనే విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూలుకు పరిగెత్తుకు వచ్చారు.