Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంతంగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు
రియో డి జనీరో : ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. వామపక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని ఒపీనియన్ పోల్స్ తేల్చిచెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే అధ్యక్ష ఎన్నికలతోపాటు 26 రాష్ట్రాలకు, ఒక ఫెడరల్ జిల్లాకు రాష్ట్ర గవర్నర్లు, సెనెటర్లు, ఫెడరల్, స్టేట్ డిప్యూటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. సావో పౌలో రాష్ట్రంలో 76 ఏళ్ల లులా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, పోటీ ప్రధానంగా ప్రస్తుత అధ్యక్షులు జైర్ బోల్సొనారో, మాజీ అధ్యక్షులు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా మధ్య మాత్రమే ఉంది. బ్రెజిల్ ఎన్నికల విధానం ప్రకారం విజేతగా ఎన్నికైన అభ్యర్థి కనీసం 50 శాతానికి పైగా ఓట్లను పొందాల్సి ఉంది. లేకపోతే ముందంజలో ఉన్న ఇద్దరి అభ్యర్థుల మధ్య రెండో దశ ఎన్నికలను ఈ నెల 30న నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో లులా విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. లులాకు 50 శాతానికిపైగా ఓట్లు వస్తాయని తాజాగా శనివారం వెల్లడించిన డేటాఫోల్హా సర్వే కూడా తెలిపింది. బోల్సోనారోకు 36 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బోల్సొనారో పరిపాలనపై అనేక విమర్శలు వున్నాయి. బోల్సొనారో పదవీ వ్యామోహం, కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, అమెజాన్ వర్షపాత అడవులను గత 15 ఏళ్లలో ఘోరంగా నిర్మూలించడం వంటి అంశాలు అతనిపై వ్యతిరేకతకు కారణంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడంతో మూడు కోట్ల మందికిపైగా పేదరికంలోకి నెట్టబడ్డారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో వామపక్ష అభ్యర్థి లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా మరోసారి అధికారంలోకి వస్తారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. పేదలు, మహిళలు, మైనార్టీలు లులాకు అండగా ఉన్నారని చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో వామపక్ష అభ్యర్థులు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కొలంబియాలో గుస్తావో పెట్రో, చిలీలో గార్బియల్ బోరిక్, పెరూలో పెడ్రూ కాస్టిల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే బ్రెజిల్‌లోని లులా చేరుతారని ఒపీనియన్ పోల్స్ నమ్మకంగా చెబుతున్నాయి. ఈ విషయాన్ని బోల్సొనారో పరోక్షంగా ఇప్పటికే అంగీకరిస్తున్నారు. పదే పదే ఇవిఎంలపై విమర్శలు చేస్తూ, వాటి విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు.