Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రౌండ్లో ఎవరికీ రాని మెజారిటీ
బ్రసీలియా : ఆదివారం బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్ ముగిసిన తర్వాత ఏ అభ్యర్ధికీ మెజారిటీ రాలేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా, ప్రస్తుత అధ్యక్షుడు జేర్ బోల్సనారోలకు ఈ నెల 30న తిరిగి రెండో రౌండ్ నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో మొత్తంగా 11మంది అభ్యర్ధులు వుండగా, కేవలం వీరిద్దరికి మాత్రమే గణనీయంగా మద్దతు లభించింది.
2003 నుండి 2010 వరకు అధ్యక్షుడుగా పనిచేసిన లూలా డసిల్వాకు 48.1శాతం ఓట్లు రాగా, బోల్సనారోకి 43.5శాతం ఓట్లు లభించాయి. 98.8శాతం ఓట్ల లెక్కింపు ముగిసినా ఏ ఒక్కరికీ మెజారిటీ రాకపోవడంతో ఇక మొదటి రౌండ్‌తో విజయం అసాధ్యమని భావించి రెండో రౌండ్‌కి సిద్ధమైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని ముందునుండీ చెబుతున్నా, అలాగే జరగబోతోందంటూ లూలా వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి శావోపాలో లోని హౌటల్లో ఆయన మాట్లాడారు. తుది విజయం వరకు మన పోరాటం కొనసాగుతుందన్నారు. సామాజిక అసమానతలను పరిష్కరించడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం వంటి అంశాల పైనే లూలా ప్రధానంగా తన ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించారు. సంపన్నులపై పన్ను భారాన్ని పెంచుతానని, సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరిస్తానని, కనీస వేతనాలను పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు.