Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సావోపోలో ఆదివాసీ సభ్యురాలిగా ఎన్నికైన సోనియా
సావోపోలో : బ్రెజిల్‌లోని సావోపోలో రాష్ట్రం నుండి మొదటి ఫెడరల్ ఆదివాసీ శాసన సభ్యురాలిగా సోనియా గుయాజజరా ఎన్నికయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యావరణ కార్యకర్త అయిన సోనియా సోషలిజం అండ్ లిబర్టీ పార్టీ (పిఎస్ఓఎల్) అభ్యర్థిగా పోటీ చేశారు. ''మీరు నాపై నమ్మకాన్ని వుంచినందుకు కృతజ్ఞతలు. మనందరం చేతులు కలిపి, కొత్త బ్రెజిల్‌ను నిర్మిద్దాం'' అని సోనియా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. చారిత్రకంగా అణచివేయబడిన, గొంతు నొక్కబడిన వారి వాణి వినిపించే బ్రెజిల్ రాజకీయ కేంద్రానికి ఆదివాసీలను, నల్ల జాతి వారిని, రైతులను తీసుకువద్దామని ఆమె పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా బలహీనపడిన బ్రెజిల్ ప్రజాస్వామ్య పునర్నిర్మాణం కోసం, వైవిధ్యత, బహుళత్వాన్ని గౌరవించేందుకు, మైనారిటీల హక్కుల రక్షణకు, పోరాడదామని అమె పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సాగుతున్న అగ్రి బిజినెస్‌లు బ్రెజిల్ పర్యావరణ వ్యవస్థల విధ్వంసక శక్తుల్లో ఒకటిగా మారాయని సోనియా తన ఎన్నికల ప్రచారం ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఆదివాసీల ప్రాంతాల హద్దులను క్రమబద్ధీకరించేందుకు అనుకూలంగా ఒక విధానాన్ని రూపొందించాల్సి వుందన్నారు. మితవాద అధ్యక్షుడు జేర్ బోల్సనారో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. నదులను కలుషితం చేసే, అడవులను ధ్వంసం చేసే గనుల తవ్వకాలను అనుమతించబోమన్నారు. 1974లో జన్మించిన సోనియా అణిచివేతకు గురైన వారి హక్కుల కోసం పోరాడుతున్నారు.