Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెలారస్కు చెందిన అలెస్ బియాలియాత్స్కీతో
సహ మరోరెండు మానవ హక్కుల సంస్థలకు శాంతి పురస్కారం
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి. పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు వరించింది. బెలారస్కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాత్స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్లకు చెందిన మానవ హక్కుల సంస్థలు 'మెమోరియల్', 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్'కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది.'పురస్కార గ్రహీతలు.. వారివారి దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పక్షాన్ని విమర్శించే హక్కుతోపాటు పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఏండ్లుగా పోరాడుతున్నారు. హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, యుద్ధ నేరాల నమోదులో అద్భుత పనితీరు కనబర్చారు. శాంతి, ప్రజాస్వామ్యాలతో కూడిన పౌర సమాజ ప్రాధాన్యాన్ని వారు చాటుతున్నారు' అని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది ఈ పురస్కారం.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషికి చేసిన జర్నలిస్టులు మరియా రెసా(ఫిలప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)లకు దక్కిన విషయం తెలిసిందే.బెలారస్కు చెందిన అలెస్ బియాలియాత్స్కీ 1980ల్లో దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో ఒకరు. ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2021 జులై నుంచి జైల్లో ఉన్నారు. మానవ హక్కుల సంస్థ 'మెమోరియల్'.. రష్యాలో రాజకీయ అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై సమాచారాన్ని క్రమబద్ధంగా నమోదు చేసింది. కీవ్లోని 'సివిల్ లిబర్టీస్ సెంటర్'.. ఉక్రెయిన్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తోంది. పౌర సమాజాన్ని బలోపేతం చేయడంతోపాటు, ఉక్రెయిన్ను పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు పోరాటం చేస్తోంది.