Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రస్తుతం 27 దేశాల్లో కలరా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పేదరికం, అంతర్యుద్ధాలు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రస్తుతం ప్రపంచంలో కలరా వ్యాప్తికి కారణాలుగా ఉన్నాయని ప్రపంచ ఆర్యోగ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసస్ తెలిపారు. జెనీవాలో ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాదిలో కలరా సగటు మరణాల సంఖ్య గత ఐదేళ్లలో సంభవించిన మరణాల సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సిరియాలో గత ఆరు వారాల్లో 10 వేలకు పైగా కలరా కేసులు నమోదయ్యాయని చెప్పారు. హైతీలో గత మూడేండ్ల కంటే ఈ ఏడాదిలో కలరా వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. ఈ వారంలోనే కలరాతో ఏడు మరణాలు, 111 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలో పేదరికం, అంతర్యుద్ధాలతో కలరా వ్యాప్తి ఎక్కువగా ఉండేదన్నారు. ఇప్పుడు పేదరికంతోపాటు వరదలు, తుఫాన్లు, కరువు వంటి వాతావరణ మార్పులతో స్వచ్ఛమైన నీటికి కొరత ఏర్పడటం, అపరిశుభ్రత వల్ల కలరా వ్యాప్తి చెందుతోందన్నారు. వ్యాక్సిన్లతో దీనిని నివారించవచ్చని, వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని తయారీదారులను కోరామని తెలిపారు. మనదేశంలోనూ మహారాష్ట్ర, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో కలరా కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 261 కలరా కేసులు, ఆరు మరణాలు సంభవించగా, పుదుచ్చేరిలో 46 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య స్వల్పంగా కనిపిస్తున్నా.. గత పదేండ్లలో కలరా కేసులతో పోలిస్తే గరిష్టమైనవిగా గణాంకాలు చెబుతున్నాయి.