Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాకహోమ్ : అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని జ్యూరీ సోమవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ డైబ్విగ్లు నోబెల్ బహుమతి 2022కు ఎంపికైనట్టు తెలిపింది. ఆర్థికవ్యవస్థలో బ్యాంకుల పాత్రపై వారిచ్చిన వివరణను బహుమతికి ఎంపిక చేసినట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను మెరుగుపరిచేందుకు దోహదపడిందని జ్యూరీ పేర్కొంది. నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆర్థికవేత్తల్లో ఒకరైన బెన్ బెర్నాంకే గతంలో ఫెడరల్ రిజర్వ్ చీఫ్గా విధులు నిర్వహించారు. ఇటీవల కరోనా మహమ్మారితో ప్రపంచం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభంతో పాటు 2008లో తలెత్తిన ఆర్థిక మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై వివరణనిచ్చినందుకు ఈ త్రయం పురస్కారాన్ని గెలుచుకుంది. ఆర్థిక రంగాన్ని ఎలా కట్టుదిట్టం చేయాలనే అంశంతో పాటు 1930 నాటి మహా సంక్షోభం వంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడు బ్యాంకింగ్ వ్యవస్థ విఫలం కాకుండా ఎలా చూడాలి అనే అంశాలను వారు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు, ఆర్థిక నియంత్రణ సంస్థలు వీరు పరిశోధనల నుంచి తీసుకున్న చర్యల ద్వారానే ఇటీవలి రెండు ప్రధాన సంక్షోభాలను ఎదుర్కోగలిగాయని జ్యూరీ అవార్డుల ప్రకటన సమయంలో పేర్కొంది.