Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : క్రిమియా బ్రిడ్జ్‌పై దాడి ఘటనకు సంబంధించి అరెస్టులు జరిగినట్లు రష్యా ప్రకటించింది. ప్రధాన వ్యూహకర్తతో సహా నిందితుల పేర్లను వెల్లడించింది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ రక్షణ శాఖకు చెందిన ఉక్రెయిన్ మెయిన్ డైరెక్టరేట్ ఉందని, ఈ సంస్థ కమాండర్ క్రిరిల్ బుడనోవ్ ఈ ఆపరేషన్‌కు వ్యక్తిగతంగా బాధ్యుడని రష్యా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి అనుమానితులుగా 12 మంది వ్యక్తులను రష్యా గుర్తించింది. ఇందులో ఎనిమిది మందిని రష్యాకు చెందిన దేశీయ సెక్యూరిటీ సర్వీస్ ఎఫ్ఎస్బి అరెస్టు చేసింది. అరెస్టు చేసిన వారిలో ఐదుగురు రష్యన్లు, మరో ముగ్గురు విదేశీయులు. వీరికి ఉక్రెయిన్, ఆర్మేనియా పౌరసత్వం ఉంది. బ్రిడ్జిని పేల్చి వేసిన ట్రక్కు ఉక్రెయిన్‌లోని ఓడెస్సా నగరం నుంచి వచ్చిందని, పేలుడు పదార్థాలను ప్లాస్టిక్ ఫిల్మ్‌లో రోల్స్‌గా చుట్టారని రష్యా తెలిపింది. పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్ ఫోటోను కూడా ఎఫ్ఎస్బి విడుదల చేసింది. విచారణ సాగుతోందని, ఈ దాడికి ప్రణాళిక రూపొందించినవారు, వారి సహచరులు అంతా బాధ్యత వహించాల్సి ఉంటుందని రష్యా తెలిపింది.