Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాపై ఐరాసలో తీర్మానం
- ఓటింగ్‌కు భారత్ దూరం
న్యూయార్క్ : ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాల విలీనాలను వెనక్కి తీసుకోవాలని రష్యాకు ఐరాస విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, దొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్యసమితి అనుబంధ ఏజెన్సీలు రష్యా విలీనాన్ని గుర్తించొద్దని కోరింది. అలాగే రష్యా తక్షణమే ఉక్రెయిన్ నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది. దీనిపై బుధవారం ఓటింగ్ చేపట్టగా 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరగువా దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. చైనా, క్యూబా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థారులాండ్, వియత్నాం దేశాలు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యధిక దేశాలు మద్దతివ్వడంతో ఈ తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ''దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి స్థాపనకు మార్గం వేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇరు దేశాలు(ఉక్రెయిన్-రష్యా) దాడులను విరమించి, యుద్ధ పరిస్థితులను ముగించేందుకు వీలైనంత త్వరగా శాంతి చర్చలను పునరుద్ధరిస్తారని మేం విశ్వసిస్తున్నాం. యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసే అన్ని ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్‌తో భేటీ సమయంలో ప్రధాని మోడీ చెప్పిన 'ఈ యుగం యుద్ధాలది కాదు' అన్న వ్యాఖ్యలను ఆమె ప్రస్తావిస్తూ 'దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం మనమంతా కృషి చేయాలి' అని అన్నారు. అందుకే ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా, ఈ తీర్మానాన్ని గత నెల అమెరికా, అల్బానియా దేశాలు ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టగా.. అప్పుడు కూడా భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అప్పుడు 15 దేశాల భద్రతా మండలిలో 10 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటెయ్యగా.. భారత్ సహా చైనా, బ్రెజిల్, గబాన్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా దీన్ని వీటో చేయడంతో అప్పట్లో అది వీగిపోయింది. దీంతో ఈ తీర్మానం ఐరాస సర్వసభ్య సమావేశం ముందుకొచ్చింది. దీనిపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని రష్యా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌పై ఓటింగ్ నిర్వహించగా భారత్‌తో సహా 107 దేశాలు తిరస్కరించాయి. దీంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మరోసారి పాక్ వక్రబుద్ధి
ఈ తీర్మానంపై చర్చ సందర్భంగానే పాక్ రాయబారి మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఈ వ్యాఖ్యలకు భారత్ కూడా దీటుగానే బదులిచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్‌పై పనికిమాలిన, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ఐరాస వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోందని మండిపడింది. అంతర్జాతీయ వేదికలపై పదే పదే అబద్దాలు వల్లె వేసే ఆ దేశం తీరును మనమంతా ఖండించాలని ఐరాసను భారత శాశ్వత రాయబారి రుచిరా కాంబోజ్ కోరారు. పాకిస్థాన్ ఎంత అసత్య ప్రచారం చేసినా జమ్ముకాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే అని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇకనైనా పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని అపాలని హితవు పలికింది.