Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనాలో తమ చదువులను పునరుద్ధరించుకునేందుకు 1300మందికి పైగా భారతీయ విద్యార్ధులు ఇటీవల చైనా వీసాను అందుకున్నారని విదేశాంగ శాఖలోని ఆసియా వ్యవహారాల విభాగ డైరెక్టర్ జనరల్ లియూ జిన్సాంగ్ తెలిపారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్‌తో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీర్ఘకాలిక విద్యార్ధి వీసాలను పునరుద్దరించడం భారత విద్యార్ధులకు ఉత్సాహాన్నిచ్చే వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ కారణంగా గత రెండేండ్ల నుంచి ఈ వీసాలను నిలుపుచేశారు. ఈ వీసాలను పునరుద్ధరిస్తే సాధ్యమైనంత త్వరగా తమ చదువును తిరిగి ప్రారంభించాలని చాలామంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారు. కోవిడ్ ఇబ్బందులను అధిగమించడానికి ఇరు పక్షాలు కృషి చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ ప్రజల మధ్య సంబంధాల్లో పురోగతి వుందని లియూ చెప్పారు. చైనా చేస్తున్న కృషికి రావత్ కృతజ్ఞతలు తెలియచేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ స్థితిగతులు, ఉమ్మడి అంశాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు విజయవంతం కావాలనలి రావత్ ఆకాంక్షించారు.