Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : టర్కీలో గ్యాస్ హబ్‌ను అభివృద్దిపరచాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం టర్కీ అధ్యక్షుడు రెసెస్ తైయీస్ ఎర్డోగన్‌కు తెలిపారు. ఉక్రెయిన్ సంబంధిత ఆంక్షలు, పైప్‌లైన్స్‌లో లీకేజీలు కారణంగా యూరప్‌కు వెళ్ళే రష్యా గ్యాస్ సరఫరాలకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో రష్యా, టర్కీను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ''ఈనాడు గ్యాస్ డెలివరీలకు చివరకు యూరప్ దేశాలకైనా గ్యాస్ సరఫరాకు అత్యంత విశ్వసనీయమైన మార్గంగా టర్కీ మారింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు గ్యాస్ సరఫరాల కోసం టర్కీలో గ్యాస్ హబ్‌ను రూపొందించే విషయాన్ని పరిశీలిస్తున్నాం.'' అని రష్యా నేత తెలిపారు. కజకస్తాన్ రాజధాని అస్తానాలో ఎర్డోగన్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి రష్యా, పశ్చిమ దేశాలతో చర్చలు జరిపే అ వకాశాన్ని అట్టిపెట్టుకోవాలని ఎర్డోగన్ భావించారు. సిరియా, ఇతర చోట్ల ఘర్షణలతో పాటూ ఇతర విషయాల్లో అభిప్రాయ భేదాలు వున్నప్పటికీ ఎర్డోగన్, చర్చలకు మొగ్గు చూపారు. ''కేవలం డెలివరీలకు ఉద్దేశించే కాకుండా, ధరలను నిర్ణయించే వేదికగా కూడా ఇది వుంటుంది.'' అని పుతిన్ తెలిపారు. ఈనాడు ధరలు విపరీతంగానే వుండొచ్చు, కానీ రాజకీయాలకు అవకాశం లేకుండా, నెమ్మదిగా తాము వాటిని క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రష్యా యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా తన డెలివరీలను తగ్గించడంతో ప్రత్యామ్నాయ ఇంధన సరఫరాల కోసం యూరప్ వెతుకులాడుతోంది.