Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానత్వం, గౌరవం ప్రాతిపదికగా ముందుకు
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) 20వ జాతీయ మహాసభకు సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10గంటలకు బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఈ మహాసభ ప్రారంభమై, 22వ తేదీతో ముగుస్తుంది. శనివారం జరిగిన జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టుల సమావేశంలో జాతీయ మహాసభ ప్రతినిధి సున్ యెలి మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నింటితో చైనా స్నేహ సంబంధాలనే కోరుకుంటుందని, అలాగే వ్యవహరిస్తుందని తెలిపారు. జాతీయత, సైద్ధాంతిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలతో, రాజకీయ పార్టీలతో సుహృద్భావ సంబంధాలు నెరుపుతుందని చెప్పారు. సమానత్వం, పరస్పర గౌరవం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి స్ఫూర్తితో ఇన్నేళ్ల కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అన్ని దేశాల రాజకీయ పార్టీలతో, సంస్థలతో స్నేహపూర్వకంగా మెలుగుతోందని తెలిపారు. విస్తృతమైన రీతిలో కార్యాచరణలకు పాల్పడుతూ, ప్రపంచవ్యాప్తంగా మరింతమంది మిత్రులను సంపాదించుకుందని సున్ చెప్పారు. ఇప్పటివరకు 170కి పైగా దేశాల నుండి 600కి పైగా రాజకీయ పార్టీలు, సంఘాలతో సిపిసి సంబంధాలు నెరుపుతోందని చెప్పారు. ఇతర దేశాల్లోని మార్క్సిస్ట్ పార్టీలతో సంబంధాలకు సిపిసి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ''సిద్ధాంతాలపై, విధానపరమైన చర్చలపై పరస్పర మార్పిడుల ద్వారా ఆయా దేశీయ పరిస్థితులకు అనుగుణమైన సోషలిస్టు అభివృద్ధి పంథాను, దేశీయ పరిస్థితులకు అనువైన రీతిలో, మన అవసరాలకు తగినట్లుగా మార్క్సిజాన్ని అనుసరించే మార్గాన్ని మేమందరం కలిసి అన్వేషిస్తున్నాం.'' అని సున్ తెలిపారు.
జిన్‌పింగ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం
బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో సిపిసి 20వ జాతీయ కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి జీ జిన్‌పింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు డెలిగేట్ క్రెడెన్షియల్స్ కమిటీలోని 22 మంది సభ్యుల జాబితాను, కాంగ్రెస్ ప్రెసిడియంలోని 243 మంది సభ్యుల జాబితాను ఆమోదించారు. వాంగ్ హునింగ్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తారని సమావేశంలో ఆమోదించారు. కాంగ్రెస్ ఎజెండాను కూడా సమావేశం ఆమోదించింది. 19వ సిపిసి కేంద్ర కమిటీ మహాసభల్లో ప్రవేశపెట్టే నివేదికను ప్రతినిధులు విని, దానిపై చర్చలు జరుపుతారు. క్రమశిక్షణపై 19వ కేంద్ర కమిషన్ ఇచ్చే కార్యకలాపాల నివేదికను పరిశీలించి, చర్చలు జరిపి పార్టీ నిబంధనావళికి సవరణను ఆమోదిస్తారని ఆయన తెలిపారు.