Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధునిక సోషలిస్టు సమాజమే లక్ష్యం
- ప్రపంచశాంతికి కట్టుబడి ఉన్నాం : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
- ప్రారంభమైన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభ
బీజింగ్ : నూతన అభివృద్ధి పంథా ద్వారానే దేశంలో ఆధునిక సోషలిస్టు స్థాపన సాధ్యమవుతుందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభ ఆదివారం బీజింగ్‌లోని ' గ్రేట్ హాల్ ఆఫ్‌ది పీపుల్ 'లో ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. చైనా వ్యాప్తంగా ఎంపికైన 2,310 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో జిన్‌పింగ్ గత కేంద్ర కమిటీ తరపున నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచశాంతికి చైనా ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. తనతో పాటు ఇతర దేశాలు కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చైనా అభివృద్ధి వ్యూహాన్ని, లక్ష్యాలను, కార్యాచరణ వంటి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 'అన్ని రంగాల్లోనూ, అన్ని విధాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా చైనాను నిర్మించాలి. దీనికోసం ముందుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన అభివృద్ధిని సాధించాలి. ఇది జరగాలంటే చైనా లక్షణాలతో కూడిన నూతన అభివృద్ధి పంధాను రూపొందించాలి' అని ఆయన అన్నారు. 'ఈ దిశలో కృషి ప్రారంభమైంది. నూతన అభివృద్ధి నమూనాను రూపొందించే కృషిని వేగవంతం చేస్తున్నాం' అని చెప్పారు. 2035వ సంవత్సరం నాటికి సోషలిస్టు ఆధునీకరణ క్రమాన్ని ప్రాథమికంగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ శతాబ్ధపు మధ్యకు సంపదతోకూడిన, పటిష్టమైన, ప్రజాస్వామ్యయుతమైన, సాంస్కృతికంగా పురోగమించిన, సామరస్యంతో నిండిన , అందమైన ఆధునిక సోషలిస్టు దేశంగా చైనాను నిర్మించాలన్నది లక్ష్యమని వివరించారు. ఈ దిశలో ప్రజా సంక్షేమాన్ని మెరుగుపరిచి, ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపరిచేందుకు సంస్కరణలను కొనసాగించాల్సిఉందని చెప్పారు. ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడం ద్వారా దీనిని సాధించాలని చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగు పరచడమే లక్ష్యంగా రూపొందించే ఈ నూతన అభివృద్ధి పంథా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మీద కూడా సానుకూల ర్పభావం చూపుతుందని చెప్పారు. సరఫరా రంగంలో చేపట్టే నిర్మాణాత్మక సంస్కరణలతో దేశీయ డిమాండ్ మరింత పెరుగుతుందని చెప్పారు. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృదికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. పేదరికంపై చేసిన పోరాటంలో సాధించిన విజయాలను సంఘటితం చేయడంతో పాటు మరింతగా విస్తరించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.
మరింత మెరుగ్గా ఒక దేశం.. రెండు వ్యవస్థలు
.ఒక దేశం, రెండు వ్యవస్థల విధానాన్ని పరిరక్షిస్తూనే, మరింత మెరుగుచాలని జిన్‌పింగ్ చెప్పారు. హాంకాంగ్ మకావు దీవులు తమ మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధికి ఇది అత్యుత్తమమైన ఏర్పాటని అన్నారు. హాంకాంగ్‌ను సుపరిపాలనవైపు మరల్చామని చెప్పారు. తైవాన్ సమస్యను పరిష్కరిస్తామని, పునరేకీకరణకోసం చిత్తశుద్ధితో శాంతియుతంగా ప్రయత్నిస్తామని తెలిపారు. అదే సమయంలో వేర్పాటువాద శక్తులను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు.
అవినీతిపై విజయం
తన ప్రసంగంలో అవినతీపై సాధించిన విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవినీతిపై పోరులో నిర్ణయాత్మక విజయాలను సాధించినట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో అనూహ్య స్థాయిలో ఈ పోరాటం సాగిందన్నారు.