Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలకు జిన్‌పింగ్ పిలుపు
- విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం ొ ఆహార భద్రత బలోపేతం
- తిరుగులేని రీతిలో సర్వతోముఖ విస్తరణ
బీజింగ్ : కఠినమైన ఉక్కు కడ్డీ మాదిరిగా చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో చైనీయులందరూ కలిసికట్టుగా వుండాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం పిలుపిచ్చారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా వాటన్నింటినీ సమర్ధవంతంగా అధిగమిస్తూ, జాతీయ పునరుజ్జీవనం అనే భారీ ఓడను తీరాలకు చేర్చాలని కోరారు. దక్షిణ చైనాలోని గుయాంగ్జి జువాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంత ప్రతినిధులతో గ్రూపు చర్చల్లో పాల్గొన్న జిన్‌పింగ్ పై వ్యాఖ్యలు చేశారు. 20వ జాతీయ మహాసభలు పార్టీ అభివృద్ధి, దేశ ప్రయోజనాలకు దిశా నిర్దేశం చేస్తాయని అన్నారు. చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని అభివృద్ధిపరిచి, పరిరక్షించేందుకు చైనా ప్రజలందరూ సమైక్యంగా వుండాలని, ఇందుకోసం ఈ మహాసభలు రాజకీయ డిక్లరేషన్‌గా, కార్యాచరణగా పనిచేస్తాయన్నారు. గుయాంగ్జీ ప్రతినిధులు ఐదుగురు జీ ప్రవేశపెట్టిన నివేదికపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఏకగ్రీవంగా నివేదికను ఆమోదించారు.
రెండంచెల అభివృద్ధి వ్యూహం
రాబోయే ఐదేళ్ళకు పార్టీ నిర్దేశించిన ప్రధానమైన కర్తవ్యమైన ఆధునీకరణ దిశగా చైనా పంథా ద్వారా జాతీయ పునరుజ్జీవనాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సిపిసి ప్రతిన బూనింది. అభివృద్దిని, భద్రతను సమన్వయం చేసుకోవాల్సిన అవసరాన్ని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. సుస్థిర అభివృద్ధిని పెంపొందించే క్రమంలో జాతీయ భద్రత, సామాజిక సుస్థిరతలను పరిరక్షించాల్సి వుందని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. అన్ని రంగాల్లో ఆధునిక సోషలిస్టు దేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నించడంలో వచ్చే ఐదేళ్లు చాలా కీలకమని అన్నారు. ఇందుకోసం రెండంచెల అభివృద్ధి వ్యూహాన్ని సిపిసి రూపొందించింది.
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం
విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని, అత్యున్నత స్థాయిలో వాటికి ద్వారాలు తెరవడాన్ని విస్తరించాలని చైనా భావిస్తోంది. ఈ క్రమంలో భాగంగా, ప్రధాన విదేశీ పెట్టుబడుల ప్రాజెక్టుల 6వ జాబితాను విడుదల చేయనుంది. జాతీయాభివృద్ధి సంస్కరణల కమిషన్ డిప్యూటీ హెడ్ ఝావో చెన్గ్జిన్ ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, జాబితాలోని ప్రాజెక్టులకు పారిశ్రామిక ప్రణాళిక, భూ వినియోగం, పర్యావరణ పరిరక్షణ అంచనా, ఇంధన వినిమయం వంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విధానపరమైన మద్దతును అందిస్తామని చెప్పారు. 2018లో మొదటగా పెట్టుబడుల ప్రాజెక్టులకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఆతర్వాత నుండి ప్రతీసారీ జారీ చేస్తూనే వున్నారు. పెట్టుబడులు, ఉత్పత్తి, నిర్వహణలో విదేశీ పెట్టుబడుల ప్రాజెక్టులు ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించడానికి సకాలంలో అధికార యంత్రాంగం సమన్వయమవుతుందని చెప్పారు.
ఆహార భద్రత బలోపేతం
జాతీయ ఆహార భద్రతకు హామీ కల్పించడాన్ని కొనసాగిస్తామని మహాసభల సందర్భంగా సీనియర్ అధికారి తెలిపారు. సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అనిశ్చితులను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకుంటామని చెప్పారు. జాతీయ ఆహార, వ్యూహాత్మక నిల్వల యంత్రాంగం డైరెక్టర్ కాంగ్ లియాంగ్ మాట్లాడుతూ, గతేడాది దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 68.3కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు. ఈ నిల్వల సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి వుందన్నారు. అంతర్జాతీయ ఆహార ధాన్యాల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొని వుండగా, చైనా ఆహార సరఫఱా మాత్రం చాలా స్థిరంగా వుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చగలిగే స్థితిలో వుందన్నారు.
సర్వతోముఖాభివృద్ధి లక్ష్యం
మరింత పారదర్శకంగా వుంటూ, అందరినీ కలుపుకుని పోతూ, సంతులన రీతిలో, అందరికీ ప్రయోజనాలు కలిగేలా ఆర్థిక సార్వజనీకరణను ముందుకు తీసుకెళ్ళడానికి, సర్వతోముఖాభివృద్దికి చైనా కృషి చేస్తుందని దేశ అత్యున్నత ఆర్థిక ప్రణాళికా రూపకర్త సోమవారం తెలిపారు.
దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన నూతన అభివృద్ధి పంథాపై అపోహలు, తప్పుడు అవగాహనలు వున్నాయని జాతీయాభివృద్ధి, సంస్కరణల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ ఝావో చెన్గ్జిన్ ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో తెలిపారు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా చైనా తన ఓపెనింగ్ అప్ ప్రయత్నాల నుండి వెనక్కి మళ్ళుతుందని లేదా స్వావలంబన గల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తుందని భావించడం తప్పని అన్నారు. ఆర్థిక సార్వజనీకరణ అనేది తిరుగులేని ధోరణి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రీతిలో కోలుకుందని అన్నారు.