Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఆహార భద్రతా ప్రాధాన్యతపై యావత్ ప్రపంచానికి చైనా దిక్సూచిలా మారింది. ఆహార భద్రతపై పటిష్టమైన చర్యలు చేపడుతూ ఇతర దేశాలకు చైనా ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా జరుపుకుంటున్న 20వ జాతీయ మహాసభల సందర్భంగా... ఆహార భద్రతను బలోపేతం చేసే దిశగా చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే చైనాలో శీతాకాలం పంట 62.1 మిలియన్ హెక్టార్లలో 70శాతానికి పైగా మొక్కలు వేసి ఫుల్ స్వింగ్‌లో ఉందని చైనా అధికారులు ఈ మహాసభ సందర్భంగా చెప్పారు. గతేడాది శీతాకాలం పంటతో పోలిస్తే.. ఈ ఏడాది 2.6శాతం ఎక్కువగా సాగవుతున్నదని వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. చైనాలో 1.9 బిలియన్ హెక్టార్ల కంటే ఎక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉందని జాతీయ ఆహార, వ్యూహాత్మక నిల్వల యంత్రాంగం డైరెక్టర్ కాంగ్ లియాంగ్ తెలిపారు. చైనా ధాన్యం ఉత్పత్తి వరుసగా ఏడు సంవత్సరాలు 650 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. వార్షిక ధాన్యం ఉత్పత్తి, స్థిరమైన మార్కెట్లతో.. ఆహార భద్రతకు భరోసా కల్పించే సామర్థ్యాన్ని చైనా మెరుగుపరుచుకుంటున్నదని జిన్హువా వెల్లడించింది.
ఈశాన్య చైనాలోని నిర్దిష్ట ప్రాంతాల్లో శీతాకాలం పంట దాదాపు 70 శాతం పూర్తయింది. వీటిలో ఎల్లో రివర్, హుయిహే నది, హైహే నది ప్రాంతాల్లో 75శాతానికిపైగా పూర్తికాగా.. వాయువ్య, నైరుతి ప్రాంతాలు రెండూ 80శాతానికి పైగా పూర్తి చేశాయి. ఇక దక్షిణ చైనా యాంగ్జీ నది, దిగువ ప్రాంతాలు దాదాపు 55 శాతం పంట వేశాయి.
ఈశాన్య చైనాలోని సుయిహువా, హీలాంగ్ జియాంగ్‌లో స్థానిక వ్యవసాయ భూమిలో 15 మిలియన్ హెక్టార్లకంటే పైగా మొక్క జొన్న పంట వేశారు. ఈ పంట అక్టోబర్ చివరి నాటికి చేతికి వస్తుందని అంచనా. ఇక వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోని అక్సుప్రిఫెక్చర్లో 2.7 మిలియన్ హెక్టార్లలో గోధుమ పంట వేశారు. 2021 చివరి నాటికి పంటల సాగు, విత్తనాలు, కోత వంటి స్థాయిల్లో యాంత్రీకరణ 85.5 శాతానికి చేరు కుంది. 2012 నుండి 2021 వరకు 19.7 మిలి యన్ కిలోవాట్ల నుండి.. 30 మిలియన్ కిలో వాట్లకు పెరిగింది. యాంత్రీకరణ దాదాపుగా 4.8 శాతం వార్షిక పెరుగుదల ఉందని మీడియా కథనా లు పేర్కొన్నాయి. అలాగే చైనాలో ఆహార ఉత్పత్తిలో ఆధునిక యంత్రాలు, సాంకేతికతలు 61 శాతానికి పైగా ఉపయోగపడుతున్నాయి అని కాంగ్ తెలిపా రు. 'ప్రస్తుతం వ్యవసాయం చేయాలంటే.. సాంకేతిక నైపుణ్యం అవసరం. ఇది మంచి పంటను దిగుబడి చేయడానికి చాలా అవసరం' అని జిన్జియాంగ్లోని ఖితారు కౌంటీలోని ఫెంగ్ రుగాంగ్ అనే రైతు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇక అత్యధిక వేడి, కరువు ఉన్నప్పటికీ ఈ సంవత్సరంలో అత్యధిక పంట నమోదు అవుతుందని చైనా నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే చైనా యువత కూడా వ్యవసాయం పట్ల మొగ్గు చూపుతున్నారు. ముఖ్యం గా వ్యవసాయ పరిశ్రమను ఆధునీకరించ డానికి యూత్ ఎక్కువ కష్టపడుతోంది. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింఘై కౌంటీకి చెందిన లిన్ అనే 35 ఏండ్ల రైతు మీడియాతో మాట్లాడు తూ... 'ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి నేను 27,854 యువాన్లు ఖర్చు చేశాను. ఆధునిక పరికరాల వల్ల సాగుకయ్యే ఖర్చు దాదాపు 30శాతం వరకు తగ్గుతుంది. ఈ పరికరా లపై స్థానిక అధికారులు రాయితీలు అందించారు' అని అన్నారు. లిన్ సుమారు 26.67 హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇందులో కొంత భాగం గోధుమ పంట వేశాడు.