Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో యూకే సతమతం
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సంక్షోభం ముదిరి తారస్థాయికి చేరింది. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనా మాతర్వాత జరిగిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ట్రస్ సెప్టెంబర్ 5న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కేవలం 45 రోజులే ఆ పదవిలో కొనసాగగలిగారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పాలించిన ప్రధాని లిజ్ కావడం గమనార్హం. పన్ను కోతలపై సెప్టెంబర్‌లో ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ వల్ల మార్కెట్లు కుదేలు కావడం, డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ రికార్డు కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి పరిస్థితులు పెద్ద తలనొప్పిగా మారాయి. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి హౌదా లో ఎంపీల ప్రశ్నలకు జవాబివ్వడానికి ట్రస్ బుధవారం పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మెర్ అయితే.. ''ఆమె ఇంకా పదవిలో ఉన్నారెందుకు?' అని ప్రశ్నించగా.. ''నేను ఎదురొడ్డి పోరాడే ధీరవనితను. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. బరి నుంచి పారిపోయే దాన్ని కాదు' అంటూ దీటుగా సమాధానం ఇచ్చిన మరుసటి రోజే లిజ్‌ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
బ్రిటన్ రాజు చార్లెస్‌కు చెప్పా..
ఇటీవల లిజ్‌ట్రస్ ప్రకటించిన మినీ బడ్జెట్ ఆ దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె డౌనింగ్ స్ట్రీట్ బయట మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజు చార్లెస్‌కు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు.
ఆది నుంచి వెనుకడుగులే!
లిజ్‌ట్రస్ ప్రధానిగా పదవి చేపట్టిన తొలినాళ్లలోనే పలు నిర్ణయాలపై యూ టర్న్‌లు తీసుకుంటూ వచ్చారు. ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం పెను దుమారం రేపింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడంతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామలపై ఇటీవల స్పందించిన ఆమె తాము చేసిన తప్పిదాలకు క్షమిం చాలని కూడా కోరారు. తాను ఎక్కడికీ వెళ్లననీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కన్జర్వేటివ్ పార్టీ నేతగానే కొనసాగుతానని విశ్వాసం వ్యక్తంచేశారు.