Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రపంచ శాంతిని పరిరక్షించడం, ఉమ్మడి అభివృద్ధిని ప్రోత్సహించడం, మానవాళి భవిష్యత్‌కు ఉపయోగపడే సమాజ నిర్మాణంతో ముందుకెళ్ళడమే చైనా దౌత్యం లక్ష్యం, ప్రయోజనమని చైనా ఉప విదేశాంగ మంత్రి మా ఝావోగ్జూ పేర్కొన్నారు. గురువారం ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన, చైనాకు పశ్చిమ దేశాలకు మధ్య పెరుగుతున్న విభేదాలు అంతర్జాతీయ వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తాయన్న వాదనలను తోసిపుచ్చారు. ఇప్పటికీ ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వాన్ని పట్టుకుని వేలాడుతున్న వారిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇటువంటి వారందంరూ ముఠాలుగా ఏర్పడి, తమ సిద్ధాంతాలకు, విభేదాలకు అనుగుణంగా విభజన రేఖలు గీసుకుని ఘర్షణలు రెచ్చగొడుతూ వుంటారని అన్నారు. గుత్తాధిపత్యం, బెదిరింపులకు పాల్పడడం ఈనాటి ప్రపంచ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా వున్నాయన్నారు. చీలికలు, పేలికలైన ప్రపంచం ఎవరి ప్రయోజనాలను నెరవేర్చలేదని అన్నారు. మానవాళి భవిష్యత్‌కు ఉపయోగపడే సమాజ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు. పారదర్శకమైన, అందరినీ కలుపుకుని పోయే, పరిశుద్ధమైన, అందమైన ప్రపంచాన్ని నిర్మించాలన్నది చైనా లక్ష్యమని, దాని కోసమే పోరాడుతుందని అన్నారు. అటువంటి ప్రపంచంలో శాశ్వత శాంతి, సార్వజనీన భద్రత, ఉమ్మడి సంక్షేమం వుంటాయని అన్నారు.