Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డుకు ఎంపికైన కాశ్మీరీ జర్నలిస్టు సన్నా ఇర్షాద్ మట్టూ ఆ అవార్డు అందుకునేందుకు న్యూయార్క్ వెళ్లకుండా భారత అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో ఈ నెల 17న అడ్డుకున్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సన్నా ఇర్షాద్ మట్టూ అమెరికా రాకుండా అడ్డుకున్నారన్న విషయం గురించి తెలుసుకున్నామని చెప్పారు. తామంతా మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. మీడియా స్వేచ్ఛపై గౌరవంతోపాటు ప్రజాస్వామ్య విలువలపై ఇరుదేశాలు నిబద్ధత కలిగి ఉండటమే భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధానికి మూలస్థంభమని అన్నారు.
జర్నలిస్ట్‌ని అడ్డుకోవడానికి ఇతర ప్రత్యేక కారణాలున్నాయా అన్న విషయం తెలియదని, ఆ పరిణామాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. పులిట్జర్ అవార్డు సాధించిన జర్నలిస్ట్ సన్నా ఇర్షాద్ అమెరికా వీసా, టికెట్ సహా అన్ని సరైన ప్రయాణ పత్రాలు కలిగి ఉన్నప్పటికీ భారత అధికారులు ఎటువంటి కారణం లేకుండా ఎందుకు అడ్డుకున్నారో అర్థంకావడం లేదని జర్మనీకి చెందిన సిపిజె ఆసియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బెహ్ లిహ్యి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఏకపక్షమైనదని, మితిమీరినదని అన్నారు. కాశ్మీర్లో పరిస్థితులను కవర్ చేసే జర్నలిస్టులపై వేధింపులు, బెదిరింపులను తక్షణమే భారత అధికారులు నిలిపివేయాలని బెహ్ సూచించారు.