Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరిన్ని అద్భుతాలు సృష్టిద్దాం
- విశ్వాసం వ్యక్తం చేసిన చైనా కమ్యూనిస్టు పార్టీ
- విజయవంతంగా ముగిసిన మహాసభలు
- నేడే ప్రధాన కార్యదర్శి ఎన్నిక
బీజింగ్ : నూతన శకం దిశగా ఆరంభించే సరికొత్త ప్రయాణంలో కొత్త, మహత్తరమైన అద్భుతాలు సృష్టించగలిగే సామర్ధ్యం, విశ్వాసం చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ)కి ఉన్నదని అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. శనివారంతో పార్టీ 20వ జాతీయ మహాసభలు ముగిశాయి. ఏకీకృత ఆలోచన, విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, కార్యాచరణను రూపొందించడం, నైతిక విలువలను పెంపొందించడం వంటి లక్ష్యాలను సీపీసీ మహాసభలు నెరవేర్చాయని ఆయన అన్నారు. వారం రోజుల పాటు 'గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్'లో జరిగిన మహాసభల ముగింపు సమావేశంలో 2338 మంది ప్రతినిధులు, ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రతినిధులనుద్దేశించి జిన్పింగ్ మాట్లాడారు. ''అరుణ పతాకాన్ని మరింత మహోన్నతంగా నిలపడం, మన బలాన్ని సమీకరించుకోవడం, సంఘీభావం, అంకిత భావాన్ని పెంపొందించే మహాసభలివి'' అని ఆయన వ్యాఖ్యానించారు. జిన్పింగ్ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో 205మంది సభ్యులు, 171మంది ప్రత్యామ్నాయ సభ్యులతో కొత్త సీపీసీ కేంద్ర కమిటీని కాంగ్రెస్ ఎన్నుకున్నది. 133మంది సభ్యులతో పార్టీ కేంద్ర క్రమశిక్షణా సంఘాన్ని కూడా ఎన్నుకున్నారు. 19వ సీపీసీ కేంద్ర కమిటీ నివేదికపై తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. సీపీసీ నిబంధనావళికి చేసిన సవరణపై తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ''మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, నిర్దేశించిన లక్ష్యాలు, చేసిన తీర్మానాలు ఇవన్నీ ఆధునిక, సోషలిస్టు దేశాన్ని నిర్మించేందుకు మనం చేసే కృషిలో కీలక పాత్ర పోషిస్తాయనీ, మనకు మార్గనిర్దేశనం చేస్తాయనీ, అన్ని రంగాల్లో జాతీయ పునరుజ్జీవనాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు, చైనా లక్షణాలతో కూడిన సోషలిజానికి సరికొత్త విజయాలను సాధించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయని మనం విశ్వసిద్దాం'' అని జిన్పింగ్ వివరించారు. పార్టీ యొక్క మూల ఆశయం, వ్యవస్థాపక కర్తవ్యాలు, దేశ అత్యున్నత ప్రాథమిక ప్రయోజనాలు వీటిని దృష్టిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలని ప్రతినిధులను జిన్పింగ్ కోరారు. 'ఈ దేశం ఈ ప్రజలది, ఈ దేశ ప్రజలది.' అన్న ఆలోచన ఎప్పుడూ మన మదిలో ఉండాలని కోరారు. మహాసభలకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి అనేక అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. మహాసభ అధ్యక్షవర్గం ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలను అందచేస్తోందని జిన్పింగ్ తెలిపారు.
నేడే ఎన్నిక
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మరో ఐదేండ్ల పదవీకాలానికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. శనివారం ఆయన శక్తివంతమైన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. కాగా మరోవైపు, ఉన్నత స్థాయిలో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ప్రధాని లీ కెకియాంగ్తో సహా పలువురు అగ్ర నేతలు రిలీవ్ అయ్యారు. కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమై 25మంది సభ్యులతో కూడిన రాజకీయ బ్యూరోను ఎన్నుకుంటుంది. ఆ బ్యూరో ఏడుగురు లేదా మరింతమంది స్థాయీ సంఘం సభ్యులను ఎన్నుకుంటుంది. దేశానికి దిశా నిర్దేశం చేసేది ఈ స్థాయీ సంఘమే. పార్టీకి, దేశానికి నేతృత్వం వహించే ప్రధాన కార్యదర్శిని స్థాయీ సంఘమే ఎన్నుకుంటుంది. మూడోసారి ఎన్నికవుతుండడం ద్వారా జిన్పింగ్ తన అధికారాన్ని మరింత సంఘటితపరుచుకోనున్నారు.