Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..విధులు : షీ జిన్‌పింగ్
- అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్ ఎన్నిక
- నూతన ప్రధానిగా లి కియాంగ్
బీజింగ్ : చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ మరోమారు ఎన్నికయ్యారు. మావో జెడాంగ్ తర్వాత పార్టీ పగ్గాలు, దేశాధ్యక్ష పదవి మూడోసారి చేపట్టిన నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డ్ సృష్టించారు. శనివారం పార్టీ 20వ జాతీయ మహాసభ ముగియగా, 205మంది సభ్యులు, 171మంది ప్రత్యామ్నాయ సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. పార్టీలో అత్యున్నత నిర్ణాయత్మక శక్తిగల 25 మంది సభ్యులతో పొలిట్‌బ్యూరో, ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంది. అటు తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌కు పగ్గాలు అప్పగిస్తూ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కొత్త ప్రీమియర్ (దేశ ప్రధాని)గా లీ కియాంగ్‌ను ఎంపికయ్యారు. స్టాండింగ్ కమిటీ సమావేశ వివరాల్ని ఆదివారం మీడియా ముఖంగా దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెల్లడించారు. నూతనంగా ఏర్పడ్డ స్టాండింగ్ కమిటీ సభ్యులను అందరికీ పరిచయం చేశారు.
ముందుకు సాగుతాం : షీ జిన్‌పింగ్
పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షుడిగా మరో ఐదేండ్లపాటు షీ జిన్‌పింగ్ పదవిలో కొనసాగనున్నారు. మూడోసారి చైనా పగ్గాలు చేపట్టిన క్రమంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచానికి చైనా అవసరముందని పేర్కొన్నారు. ''ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి సాధించలేదు. అలాగే ప్రపంచానికి చైనా అవసరం. సంస్కరణల వైపు 40ఏండ్లపాటు చేసిన పోరాటంతో రెండు అద్భుతాలను సాధించాం. అవి వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మా పార్టీ విధులు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతా''మని జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధినేతగానూ జిన్‌పింగ్ ఎన్నికయ్యారు.
ఏడుగురు సభ్యులతో కూడిన పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీని సీసీపీ ఆదివారం ప్రకటించింది. ఇందులో కొత్త ప్రీమియర్‌గా షాంఘై చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి లీ కియాంగ్‌ను ఎంపికచేశారు. ఆయన ఎంపికను అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతోపాటు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యుల పేర్లను కూడా వెల్లడించారు. ఈ ఏడాది షాంఘైలో పెద్దఎత్తున కరోనా కేసులు నమోదుకాగా, కఠిన నిబంధనలతో వైరస్ వ్యాప్తిని లీ కియాంగ్ అడ్డుకోగలిగారు. గతంలో ఝిజియాంగ్ ప్రావిన్స్‌లో షీ జిన్‌పింగ్‌తో కలిసి పనిచేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పనిచేయబోతున్నారు.
అక్టోబర్ 16న ప్రారంభమైన పార్టీ 20వ జాతీయ మహాసభలో 2300మంది ప్రతినిధులు నూతన నాయకత్వాన్ని ఎంచుకునే ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దేశ సమగ్ర అభివృద్ధిలో, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా చైనాను నిలబెట్టడంలో షీ జిన్‌పింగ్ సఫలమయ్యారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే దేశంగా ప్రపంచవ్యాప్తంగా చైనా పట్ల నమ్మకాన్ని పెంచారు. కరోనా సంక్షోభం కారణంగా చైనాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని జిన్‌పింగ్ నేతృత్వంలోని నాయకత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నది. 'జీరో కోవిడ్' పాలసీలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలబడుతోంది. విదేశీ పర్యటనల అనంతరం 15 రోజులు క్వారంటైన్లో ఉన్న షీ జిన్‌పింగ్, కరోనా నిబంధనల ప్రాముఖ్యతను పాటించి చూపారు.