Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి
- కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరిక
లండన్ : బ్రిటన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని, అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు ప్రభుత్వం ముందు ఉన్నాయని బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ (42) అన్నారు. ఆర్థిక స్థిరత్వం, ఐక్యత ప్రాధాన్యతగా తన ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. భారత మూలాలున్న రిషి సునాక్ మంగళవారం బ్రిటన్ ప్రధానిగా నియమితులయ్యారు. బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అధికారికంగా ఆయన్ను ప్రధానిగా ప్రకటించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. దీంతో రిషి..గడిచిన 200ఏండ్లలో బ్రిటన్ పాలనాపగ్గాలు చేపట్టిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు కింగ్ ఛార్లెస్-3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినట్టు వెల్లడించారు. అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.
మాటలు కాదు..చేతలద్వారా నిరూపిస్తాం..
''ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోంది. ఈ దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం లిజ్ ట్రస్ (మాజీ ప్రధాని) పనిచేయడం తప్పుకాదు. ఆమె గొప్ప వ్యక్తి. కానీ కొన్ని పొరపాట్లు చోటుచేసుకున్నాయి. వాటిని సరిచేసేందుకు నాకు బాధ్యతలు అప్పగించారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రతి దశలో పారదర్శకంగా పనిచేస్తోంది. మేం ప్రతిస్థాయిలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తాం. మాటలతో కాకుండా చేతల ద్వారా ఈ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తాం. బ్రిటన్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమిస్తాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. బ్రిటన్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నా''మని ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ బయట రిషి సునాక్ మీడియాతో వ్యాఖ్యానించారు.
నేపథ్యం
పంజాబ్‌కు చెందిన రిషి సునాక్ పూర్వీకులు తొలుత కెన్యాకు వలసవెళ్లారు. అక్కడ్నుంచీ బ్రిటన్‌కు వచ్చారు. మే 12, 1980లో జన్మించిన సునాక్..తండ్రి యశ్వీర్ వైద్యుడు, తల్లి ఉష ఫార్మసిస్టు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని 2009లో సునాక్ వివాహమాడారు. రిషి సునాక్, అక్షతా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాజకీయాల్లోకి 2015లో రంగప్రవేశం చేశారు. యార్క్‌షైర్‌లోని రిచ్మండ్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.