Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూతాపాన్ని తగ్గించే కార్యాచరణను
బలోపేతం చేయాలి : ప్రపంచ దేశాలకు ఐరాస సూచన
న్యూయార్క్ : భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకూ చాలవని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కొత్త నివేదికను విడుదల చేసింది. 2015లోని పారిస్ ఒప్పందంలో నిర్దేశించినట్టుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న వాతావరణ ప్రణాళికలు సరిపోవని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇప్పటికే భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందనీ, ఉష్ణోగ్రతలూ పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ గ్రీన్హౌస్ వాయువులను అణచివేసేందుకు ప్రపంచ దేశాలు అత్యవసరంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా మనం ఇప్పటికీ లేమని ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సిమన్ స్టీల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ తమ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని అన్నారు. వచ్చే 8 ఏండ్లలో వీటిని అమలు చేయాల్సి వుందని స్పష్టం చేశారు. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయువులు 43శాతం తగ్గాల్సిన అవసరం వుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అప్పుడే పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలమన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే, 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో పేర్కొంది.