Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాటతో 153 మంది మృతి
- మరో 103 మందికి గాయాలు
సియోల్ : దక్షిణకొరియాలో హాలోవిన్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రాజధాని సియోల్‌లోని ఓ మార్కెట్లో జరిగిన తొక్కిసలాటలో 153 మంది మరణించారు. 103 మంది గాయపడ్డారు. వీరిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయినవారిలో 20 మంది విదేశీయులున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. కరోనా ఆంక్షల కారణంగా రెండేళ్లగా నిలిపివేసిన వేడుకలను ఈ ఏడాది అక్టోబర్ 31న నిర్వహించాలని భావించారు. దీంతో శనివారం రాత్రి సియోల్‌లోని వందలాది దుకాణాలు కలిగిన మెగాసిటీ ఇటావాన్కు ప్రజలు పోటెత్తారు. ఇరుకైన వీధి కావడం, అంచనాకు మించి జనం అక్కడికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. సుమారు లక్ష మంది ఆ వీధికి చేరుకున్నట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. సమీపంలోని బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు యత్నించడంతో తొక్సిసలాట జరిగినట్లు సమాచారం.స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 12 గంటల సమయంలో వందలాది మంది ఓ హోటల్ దగ్గర స్పృహ తప్పిపడిపోయారని హెరాల్డ్ వార్తా సంస్థ పేర్కొంది. మరణాల సంఖ్య పెరుగుతూ .. ఉదయం 8 గంటల సమయానికి 150 పైబడిందని పేర్కొంది. వీరిలో అత్యధికులు యువతీ, యువకులే. ఎక్కువ మంది గుండెపోటుకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.సుమారు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. 2014లో ఒక పడవ మునిగిన ఘటనలో 304 మంది చనిపోగా.. ఆ ఘటన తర్వాత అత్యధిక మంది చనిపోయిన ఘటనగా తాజా తొక్కిసలాట రికార్డులకెక్కింది. ఈ విషాద ఘటన పట్ల దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.