Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మితవాద ప్రభుత్వానికి ముగింపు
- బోల్స్నారోను ఓడించి అధ్యక్ష పీఠంపై మూడోసారి లూలా..
- నియంతృత్వ పాలకులకు వ్యతిరేకపోరాటమిది.. : ఏచూరి
బ్రసీలా : బ్రెజిల్ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లూలా విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు జైర్బోల్స్నారోను ఓడించి అధ్యక్ష పీఠాన్ని తిరిగి గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో దశాబ్ద కాలంగా దేశంలో పాలనసాగిస్తున్న మితవాద ప్రభుత్వానికి ప్రజలు ముగింపు పలికారు. లూలా 50.8శాతం ఓట్లు సాధించగా, బోల్సెనారో 49.2 శాతం ఓట్లు సాధించినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి లూలా మాట్లాడారు. దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తానని, ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యత్నిస్తానని అన్నారు. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలనీ ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలని సూచించారు. ప్రపంచ వ్యాణిజ్యాన్ని మరింత పారదర్శకంగా చేస్తామని పేర్కొన్నారు. తన విజయ ప్రసంగంలో శాంతి, ప్రజాస్వామ్యం ఆవశ్యకతను ఎత్తి చూపారు. తాజా ఎన్నికతో లూలా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ ఎన్నికలతో బోల్సెనారో మితవాద ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించినట్లైంది. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో బోల్సెనారో ప్రభుత్వం విఫలం కావడంతో ఆరులక్షల మంది మరణించారు. దీంతో మితవాద పార్టీ సభ్యుల మద్దతును బోల్సెనారో కోల్పోవలసి వచ్చింది.
ప్రజలు అందించిన అద్భుత విజయం..ఏచూరి
బ్రెజిల్ ఎన్నికల్లో లూలా విజయం సాధించడంపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. బ్రెజిల్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలు అందించిన ఈ అద్భుతమైన విజయం ..నియంతత్వ పాలకులకు వ్యతిరేకంగా ప్రజల పోరాటాలను ఉధతం చేస్తుందని అన్నారు. కార్మిక హక్కులు, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం మానవీయ విలువలను నెలబెడుతుందని అన్నారు.