Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటింగ్‌కు భారత్ దూరం
వాషింగ్టన్ : ఐరాసలో గురువారం రష్యా ప్రవేశపెట్టిన ఒక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల్లో ఉక్రెయిన్-అమెరికాలు 'మిలటరీ బయోలాజికల్ కార్యక్రమాలు' నిర్వహిస్తున్నాయని, దీనిపై విచారణకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఐరాస భద్రతా మండలిలో రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇది జీవాయుధాల ఒప్పందం (బిడబ్ల్యూసి)ను ఉల్లంఘించడమేనని తీర్మానంలో రష్యా ఆరోపించింది. అయితే రష్యా, చైనా మాత్రమే ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్‌తో సహా మండలిలో మిగిలిన సభ్యదేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది.
ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలకు భారత్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా భారత్ దూరంగా ఉండటం విశేషం. ఈ విషయంపై ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సలర్ ఎ.అమర్నాథ్ మాట్లాడుతూ బీడబ్ల్యూసీకి భారత్ అధిక ప్రాముఖ్యతనిస్తుందని తెలిపారు. దీని అమలును బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.