Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన
- సగం మందిని తొలగించే యోచనలో ఎలాన్ మస్క్
న్యూయార్క్ : సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వివిధ దేశాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఉద్యోగంలో కొనసాగాలా ? లేదా? అనే అంశాన్ని వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఖలకు పంపుతామని తెలిపింది. ప్రస్తుతం ట్విట్టర్లో దాదాపు 7500మంది ఉద్యోగులున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే జీతాల ఖర్చు తగ్గించుకోవటంపై ఎలాన్ మస్క్ దృష్టిసారించారు. దాదాపు సగం మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతున్నాడని శుక్రవారం ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక జాబితా సిద్ధమైందని అంతర్జాతీయ మీడియా కథనాలు రాసింది. ఈ ఉద్యోగుల కోతలు శుక్రవారం నుంచే మొదలుకానున్నట్టు న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనం తెలిపింది.
తొలగించిన సిబ్బందికి తమ వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీల ద్వారా సమాచారం ఇవ్వనున్నారని, విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్ ఈ-మెయిల్ ఐడీల ద్వారా సమాచారాన్ని అందించనున్నట్టు రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం..దాదాపు 3700 మందిని విధుల నుంచి తొలగించనున్నారని తెలుస్తోంది. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు. ట్విట్టర్ మౌలిక సదుపాయాల ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8208 కోట్లు) వరకు తగ్గించుకోవాలని మస్క్..ట్విటర్ టీంను ఆదేశించినట్టు తెలుస్తోంది.
శుక్రవారం నుంచి ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు మొదలవుతుందని సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు అమెరికా మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఉద్యోగుల కోతపై శుక్రవారం ఉదయం 9 గంటలకు సిబ్బందిని అప్రమత్తం చేస్తామని కంపెనీ ఈ-మెయిల్లో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైన దృష్ట్యా సిబ్బంది ఇంటికి వెళ్లవచ్చునని, శుక్రవారం ఆఫీసుకు రావొద్దని మెయిల్లో సూచించారట. ''మీరు ఆఫీసులో ఉన్నా..లేదంటే ఆఫీసుకు బయల్దేరినా..దయచేసి తిరిగి ఇంటికి వెళ్లండి''అని ట్విట్టర్ తమ ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నదని సమాచారం.