Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీలో ఐదుగురు భారతీయ-అమెరికన్లు
- ప్రతినిధుల సభకు 8న మిడ్ టర్మ్ ఎన్నికలు
- జో బైడెన్ పాలనకు రిఫరెండం : రాజకీయ పండితులు
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభకు ఈనెల 8న మిడ్ టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో ఓటర్లు డెమొక్రాట్ల వైపా, రిపబ్లికన్ల వైపా అన్నది ఆసక్తికరంగా మారింది. మరొక విధంగా ఈ ఎన్నికల్ని..అధ్యక్షుడు జో బైడెన్ పాలనకు రిఫరెండమని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ- అమెరికన్లు పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ సభ్యులైన ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బెరాలు తిరిగి ఎంపికవుతారని సర్వేలో పేర్కొన్నాయి. కాంగ్రెస్‌లో స్వల్ప మెజార్టీతో అధ్యక్షుడు జో బైడెన్...వాతావరణ మార్పులు, తుపాకీ నియంత్రణ, మౌలిక వసతుల అభివృద్ధి, బాలల పేదరికం..మొదలైనవాటిపై కీలక చట్టాలు చేయగలిగాడు. ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్ని అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్‌గా తీసుకున్నారు. శ్వేతసౌధంలో ఆయన అధికారం, పార్టీలో పట్టును ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. ప్రస్తుతం సెనెట్‌లో డెమొక్రాట్లకు స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉంది. వివిధ అంశాలపై కమిటీ విచారణలను ప్రారంభించే అధికారం కాంగ్రెస్‌కే ఉంది. ఒకవేళ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమాక్రాట్లు ఓడిపోతే.. అధ్యక్షుడిగా జో బైడెన్ పాలనకు అనేక అడ్డంకులు ఏర్పడతాయి. ఆయన అధికారానికి రిపబ్లికన్లు పరిమితులు విధించటం ఖాయం. రాష్ట్రాల చట్ట సభలను, ప్రభుత్వ పాలనను కాంగ్రెస్ నియంత్రి స్తుంది. 2024 అధ్యక్ష ఎన్నికల్ని మిడ్ టర్మ్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయనటం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం బైడెన్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. నేరా లు, ఘోరాలు మరింత పెరిగాయి. తుపాకీ కాల్పుల ఘటనలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాఠశాలల్లో చిన్నారులపై, వలస దారులపై తుపాకీ తూటాలు పేలుతుండటం.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదంతా కూడా ఈ మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని, ఓటర్లు జో బైడెన్ పాలన పట్ల ఎలాంటి తీర్పు చెబుతారోనని ఆసక్తి నెలకొంది.
ఆ నలుగురు
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బెరాలు తిరిగి గెలుపొందుతారని పోల్ సర్వే, ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. వీరిలో అమీ బెరా అందరికన్నా సీనియర్. కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి ప్రతినిధుల సభకు 6వ సారి పోటీ పడుతున్నారు. కాలిఫోర్నియాలో 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్‌కు రో ఖన్నా, ఇల్లినాయిస్లో 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు కృష్ణమూర్తి, వాషింగ్టన్లో 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు జయపాల్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈసారి జరుగుతున్న కాంగ్రెస్ మిడ్ టర్మ్ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ల గెలుపు దాదాపు ఖాయమని తెలుస్తోంది.
డెమొక్రాటిక్ పార్టీకి ఈ నలుగురు ప్రస్తుతానికి రిపబ్లిన్ పార్టీ ప్రత్యర్థుల కన్నా ముందంజలో ఉన్నారు. అలాగే డెట్రాయిట్లో ఆఫ్రికన్ అమెరికన్ భాగం నుండి ప్రతినిధుల సభలో తొలిసారి అడుగుపెట్టాలనుకుంటున్న 67 ఏండ్ల థానేదర్ కూడా గెలుపొందే అవకాశాలున్నాయి. చెన్నైలో జన్మించిన జయపాల్ ప్రతినిధుల సభకు ఎంపికైన మొట్టమొదటి ఏకైక భారతీయ-అమెరికన్ మహిళగా గుర్తింపు అందుకున్నారు. ఈ ఎన్నికల సమయం లోనే మరో భారతీయ అమెరికన్ మేరీల్యాండ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. డెమొక్రాటిక్ టికెట్‌పై అరుణా మిల్లర్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కూడా ఖాయమని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు డెమొ క్రాట్లు, రిపబ్లికన్లు పోటా పోటీగా ప్రచారం నిర్వహి స్తున్నారు. భారతీయ అమెరికన్లకు చేరువయ్యేందుకు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.