Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌కు అమెరికా విజ్ఞప్తి
న్యూయార్క్ : రష్యాతో శాంతి చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలని ఉక్రెయిన్ అధికారులకు అమెరికా ప్రభుత్వం ప్రైవేటుగా విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను పూర్తిగా తొలగించే వరకూ రష్యాతో చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్ బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. రష్యాతో చర్చలు అసాధ్యమని గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ ఒక డిక్రీ కూడా జారీ చేశారు. ఇలాంటి పట్టుదల వదిలివేయాలని, చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలని ఉక్రెయిన్‌కు అమెరికా విజ్ఞప్తి చేసినట్లు ఈ విషయం గురించి తెలిసిన అధికారులు వెల్లడించారని వాషింగ్టన్ పోస్టు తెలిపింది. ఉక్రెయిన్ను యుద్ధానికి ప్రోత్సహించడం తమ లక్ష్యం కాదని, రష్యాతో వాస్తవ చర్చలు జరిపి, ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్‌కు అమెరికా తెలిపినట్లు వాషింగ్టన్ పోస్టు తెలిపింది. గత కొన్ని నెలల నుంచి చర్చలకు రావాలని ఉక్రెయిన్ అధికారులను రష్యా పదేపదే ఆహ్వానిస్తుంది. 'అవతలి వైపు నుండి మాతో మాట్లాడటానికి కూడా సుముఖత లేనప్పుడు మేము ఏవైనా ఒప్పందాలను ఎలా చర్చించగలము?' అని పుతిన్ గత వారంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఈ విజ్ఞప్తి చేసిందని భావిస్తున్నారు.