Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎజెండాలో వాతావరణ పరిహారం
కైరో : ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో ఐక్యరాజ్య సమితి 27వ వాతావరణ సదస్సు (కాప్ 27) ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 18 వరకూ ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సులో తొలిసారిగా వాతావరణ పరిహార అంశాన్ని ఎజెండాలో చేర్చారు. దీనితో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌తో బాధపడుతున్న పేద దేశాలకు ధనిక దేశాలు పరిహారం ఇచ్చే విషయంపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ విషయాన్ని ప్రారంభ సెషన్లో కాప్ 27 అధ్యక్షులు, ఈజిప్టు పర్యావరణ మంత్రి సమేహ్ షౌక్రి వెల్లడించారు. వాతావరణ పరిహారాన్ని ఈ ఏడాది ఎజెండాలో చేర్చడం వాతావరణ విపత్తుల బాధితుల కోసం సంఘీభావాన్ని ప్రతిబింబిస్తుందని షౌక్రి అన్నారు. వాతావరణ పరిహారాన్ని ఎజెండాలో చేర్చేందుకు సదస్సు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఆమోదం లభించిందని తెలిపారు.
ఐరాస వాతావరణ ప్యానెల్ చీఫ్ హోసంగ్ లీ సదస్సు ప్రారంభోపన్యాసంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి కృషి చేయడం, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలకు అనుగుణంగా జీవించడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
మన గ్రహాన్ని, మన జీవనోపాధిని కాపాడుకోవడానికి ఒక తరానికి ఒకసారి మాత్రమే అవకాశం వస్తుందని అన్నారు. బ్రిటిష్ అధికారి అలోక్ శర్మ మాట్లాడుతూ పాకిస్తాన్, నైజీరియాలో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు, యూరప్, అమెరికాలో చైనాలో చారిత్రాత్మక కరువులను ప్రస్తావిస్తూ ప్రపంచ నాయకులకు, ప్రపంచానికి ఇంకా ఎన్ని మేల్కొలుపులు అవసరమని తీవ్రంగా ప్రశ్నించారు. సదస్సు ప్రారంభం సందర్భంగా ఆతిథ్య దేశం ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫట్టా ఎల్-సిస్సి 'ప్రతిజ్ఞల దశ నుంచి క్షేత్రస్థాయిలో నిర్థిష్ట చర్యలతో ఇంప్లాంటేషన్ దశకు వెళ్లాలని' కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. సదస్సుకు 120 మందికి పైగా ప్రపంచ నాయకులు హాజరుకానున్నారు. వీరిలో ఎక్కువ మంది ఈ నెల 7-8 తేదీల్లో ఒక ఉన్నత స్థాయి కార్యక్రమంలో మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ వారం చివరిలో వస్తారని భావిస్తున్నారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షులు సీ జిన్‌పింగ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా అనేక దేశాల నాయకులు తమ ప్రణాళిక ప్రకటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నిరసనపై ఉక్కుపాదం
వాతావరణ సదస్సు సందర్భంగా నిరసనలపై ఈజిప్టు ఉక్కుపాదం మోపిందని హక్కుల సంఘాలు ఆదివారం ఆరోపించాయి. శిఖరాగ్ర సమావేశంలో నిఘాను పెంచాయని విమర్శించాయి. నిరసనలకు పిలుపునిచ్చినందుకు వందల సంఖ్యలో ఆందోళనకారుల్ని అధికారులు అరెస్టు చేశారని న్యూయార్క్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. కాప్ 27 సదస్సుకు నెల ముందు నుంచే పౌర హక్కుల సంస్థలపై ఈజిప్టు ఆంక్షలు విధించినట్టు తెలిపింది.