Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏదో తేల్చుకోవాల్సింది మనమేనన్న యుఎన్ చీఫ్
- అమెరికా, చైనాలు న్యాయమైన వాటాను చెల్లించాలి : మాక్రాన్
షర్మ్ ఎల్-షేక్ : శిలాజ ఇంధనాల నుండి పరివర్తన చెందే క్రమాన్ని మరింత వేగిరపరిచేందుకు సంపన్న, నిరుపేద దేశాల మధ్య ఒప్పందం కుదరాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఈజిప్ట్‌లో ఆదివారం ప్రారంభమైన కాప్ 27 శిఖరాగ్ర సమావేశంలో గుటెరస్ మాట్లాడారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలి లేదా వాతావరణ విపత్తులకు భవిష్యత్ తరాలు బలవుతాయని ఈ రెండింట్లో ఏదో ఒక అవకాశాన్ని ఎంచుకోవడమే మన ముందుందని అన్నారు. అత్యంత అధ్వానమైన వాతావరణ మార్పుల ప్రభావాలను ఎలా నివారించాలనే విషయమై చర్చించేందుకు ప్రభుత్వాధినేతలు రెండు వారాల పాటు సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత, ద్రవ్యోల్బణం పెచ్చరిల్లిపోవడం వంటి సమస్యలతో సతమతమవు తున్నా వాతావరణ సంక్షోభంపై చర్చించేందుకు వారు సన్నద్ధమయ్యారు. ''ప్రస్తుతం మానవాళికి ఒక అవకాశం వుంది. సహకరించు కోవడం లేదా నాశనం కావడం.'' అని గుటెరస్ వ్యాఖ్యానించారు. పేద దేశాలు కూడా కాలుష్య వాయువులను తగ్గించుకు నేందుకు వెసులుబాటు కల్పించేలా నిధులు అందచేయాల్సిన అవసరం వుందని అన్నారు. నిధులందించే క్రమం కూడా వేగం పుంజుకోవాలని కోరారు. తద్వారా ఇప్పటికే చోటు చేసుకుంటున్న, నివారించలేనటువంటి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను ఎదుర్కొనడానికి వీలు కుదురుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలకు మరింత ప్రత్యేకమైన, మహత్తరమైన బాధ్యత వుందని, ఈ ఒప్పందం సాకారమవడానికి కృషి చేయాలని గుటెరస్ కోరారు. కర్బన ఉద్గారాలను తీవ్రంగా విడుదల చేసే బొగ్గు వినియోగాన్ని దశలవారీగా, పూర్తిగా 2040కల్లా నిర్మూలించేందుకు అంగీకరించాలని దేశాలను గుటెరస్ కోరారు. వాతావరణ సంఘీభావ ఒప్పందాన్ని కుదుర్చు కోవడం లేదా సామూహికంగా ఆత్మహత్యా ఒప్పందం చేసుకోవడం ఏదో ఒకటే మన ముందున్న మార్గమని ఆయన హెచ్చరించారు.
అమెరికా, చైనాలు న్యాయమైన వాటా చెల్లించాలి : మాక్రాన్
కాలుష్య కారకాలను తగ్గించాల్సిన, ఆర్థిక సాయాన్ని పెంచాల్సిన బాధ్యత అమెరికా, చైనాలపై వుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నారు. కాప్ సదస్సు సందర్భంగా ఫ్రెంచ్, ఆఫ్రికన్ వాతావరణ ప్రచార కర్తలతో ఆయన మాట్లాడారు. యురోపియన్ దేశాలు ఇప్పటికే అధిక మొత్తంలో చెల్లిస్తున్నాయని, ఇక యురప్యేతర సంపన్న దేశాలపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. 'మీ న్యాయమైన వాటాను మీరు చెల్లించాల్సి వుంది.' అని ఆయన వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల విపత్తును తీవ్రంగా ఎదుర్కొంటున్న నిరుపేద దేశాలకు ఆర్థిక సాయాన్ని పెంచాల్సిన ఆవశ్యకత చాలా వుందని ఆయన స్పష్టం చేశారు. సోమ, మంగళవారాల్లో దాదాపు వంద దేశాల అధినేతలు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.
స్పందించింది 29 దేశాలే
గ్లోబల్ వార్మింగ్‌ను 1.5డిగ్రీల సెల్సియస్ వద్దకు పరిమితం చేయాలంటే 2030కల్లా 45శాతం కాలుష్య వాయువులను ప్రపంచ దేశాలు తగ్గించాల్సి వుంది. కానీ ప్రస్తుత ధోరణులు చూస్తుంటే, కర్బన కాలుష్యం ఈ దశాబ్దం చివరి నాటికి 10శాతం పెరిగే అవకాశం వుందని భూమి ఉపరితలం 2.8డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతుందని ఇటీవలి సర్వేల్లో వెల్లడైంది. మొత్తంగా 194 దేశాలకు గానూ కేవలం 29 దేశాలు మాత్రమే మెరుగైన వాతావరణ ప్రణాళికలను అందచేశాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల విభాగ అధికారి సైమన్ స్టెల్ ఒక పత్రికా సమావేశంలో చెప్పారు. ఈ సదస్సు ఎజెండాలో 'వాతావరణ పరిహారం' అనే అంశాన్ని చేర్చడానికి ప్రతినిధులు అంగీకరించడమే వర్ధమాన దేశాలు సాధించిన చిన్నపాటి విజయంగా చెప్పుకోవచ్చు.
పరిశుద్ధమైన ప్రగతి అవశ్యం : రిషి సునాక్
'పరిశుద్ధమైన ప్రగతి'పై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులపై జరిగే పోరాటమనేది కొత్త ఉద్యోగాలు, పరిశుద్ధమైన ప్రగతి కోసం జరిపే అంతర్జాతీయ మిషన్‌గా మారాలని ఆయన వ్యాఖ్యానించారు. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడం ద్వారా అత్యంత అధ్వాన్నమైన ప్రభావాలను నివారించేందుకు ప్రపంచ నేతలు మరింత వేగంగా కదలాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాది క్రితం గ్లాస్గో సదస్సులో ఇచ్చిన హామీలు, నిబద్ధతలకు దేశాలు కట్టుబడి వుండాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.