Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డున పడ్డ 13% సిబ్బంది
- కొత్త నియామకాలకు చెల్లు : ఫేస్బుక్ మాతృసంస్థ నిర్ణయం
వాషింగ్టన్ : టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ఇటీవల ట్విట్టర్ సగం మంది ఉద్యోగులను తొలగించగా... తాజాగా మెటా, సేల్స్ఫోర్స్ల్లోని వేల మంది సిబ్బందికి ఆ కంపెనీలు ఉద్వాసన పలుకుతున్నాయి. 11వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జుకర్‌బర్క్ బుధవారం ప్రకటించారు. ఇది తమ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 13 శాతానికి సమానమని ఆయన తెలిపారు. దీంతో ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులు ఉండొచ్చన్న రిపోర్టులు నిజమయ్యాయి. 2004లో ఫేస్బుక్ ప్రారంభమైన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, అమెరికా సహా ప్రపంచ దేశాల్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెటాలో దాదాపు 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రూపు పరిధిలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి దిగ్గజ సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి.''ఉద్యోగుల తొలగింపు అంశాన్ని మెటా చరిత్రలో కఠినమైన రోజుగా భావిస్తున్నాం. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాము. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు నియామక ప్రక్రియను నిలిపివేస్తున్నాము. ప్రకటనల రాబడి తగ్గడం వల్ల ఆదాయంపై ప్రభావం పడింది. దీంతో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకంతటికీ నాదే బాధ్యత. తొలగింపునకు గురైన ఉద్యోగులకు క్షమాపణ చెబుతున్నాను.'' అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ట్విట్టర్ ఇటీవల తన 7500 మంది ఉద్యోగుల్లో సగం మందికి పైగా ఉద్వాసన పలికింది. కాగా.. వరుసగా పడిపోతున్న మెటా షేర్‌తో ఇన్వెస్టర్లు ఏడాది కాలంలో 10 బిలియన్ డాలర్లు నష్టపోయారు. మెటా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం రెవెన్యూలో భారీ తగ్గుదల చోటు చేసుకుంది.