Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: విదేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతున్నట్లు ఇటీవల అనేక అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లోనూ భారతీయుల జనాభా పెరిగినట్లు ఒక తాజా నివేదిక పేర్కొంది. ఇక్కడ నివసిస్తోన్న వారిలో 1.5శాతం భారతీయులే అని తెలిపింది. ఇంగ్లండ్, వేల్స్లో నివసిస్తోన్న ప్రతి ఆరుగురిలో ఒకరు విదేశాల్లో పుట్టినవారేనని తెలిపింది. బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయ (ఒఎన్ఎస్) నివేదిక-2022 ప్రకారం ఇంగ్లండ్, వేల్స్ జనాభాలో బ్రిటన్ బయట జన్మించిన వారి సంఖ్య కోటికి చేరుకుంది. గడిచిన పదేళ్లలో వీరి సంఖ్య 25లక్షలు పెరిగింది. ఈ జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 9,20,000 మంది భారతీయులుండగా.. తర్వాతి స్థానంలో పోలండ్ (7,43,000), పాకిస్థాన్ (6,24,000) ఉన్నారు.
అలాగే, లండన్‌లో ప్రతి పది మందిలో నలుగురు బ్రిటన్ బయట జన్మించినవారే కావడం విశేషం. అయితే, గత పదేళ్లలో బ్రిటన్‌కు వలస వచ్చిన వారి జాబితాలో మాత్రం రొమేనియా తొలిస్థానంలో ఉంది. 2011లో వారి సంఖ్య 80 వేలు ఉండగా.. ప్రస్తుతం 5లక్షల 39వేలకు చేరింది. రొమేనియా నుంచి వలస వచ్చే పౌరులపై ఉన్న ఆంక్షలను 2014లో ఎత్తివేసిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అంచనా. వీటితోపాటు ఐర్లాండ్, బంగ్లాదేశ్, నైజీరియా, జర్మనీ, దక్షిణాఫ్రికా నుంచి వలసలు పెరగగా.. అమెరికా, జమైకా నుంచి తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.