Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసలో 'యూనివర్సల్ పిరియడ్ రివ్యూ'
- జైల్లో నిర్బంధించిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి : యూరప్ దేశాలు
జెనీవా : భారత్లో పౌర హక్కులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారని, తీవ్రవాద వ్యతిరేక చట్టాలను ఉపయోగించటం పెరిగిందని 'ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్' ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో మానవ హక్కుల రికార్డుపై కౌన్సిల్ నేతృత్వంలో జెనీవాలో ఇటీవల సమీక్ష జరిగింది. 'యూనివర్సల్ పిరియడ్ రివ్యూ' (యూపీఆర్)గా పేర్కొనే ఈ సమీక్షా సమావేశంలో సభ్యదేశాల ప్రతినిధులు, పౌరహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు భారత్లో పౌర హక్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తరఫున పాల్గొన్న ప్రతినిధుల బృందానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నేతృత్వం వహించారు. పౌర హక్కులు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల్ని సమావేశంలో ఆయన ప్రస్తావించారు. యూపీఆర్ సమావేశంలో 130 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికిచ్చిన సమయంలో మాట్లాడుతూ..కొన్ని సూచనలు, ప్రతిపాదనలు చేశారు.
లింగ వివక్ష, హింసను రూపుమాపడానికి భారత్లో చట్టాలు ఉన్నా..సమాజంలో కొనసాగుతున్నాయని అమెరికా ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపా చట్టం పేరుతో హక్కుల కార్యకర్తల్ని అరెస్టు చేసి జైల్లో నిర్బంధిస్తున్నారని, సుదీర్ఘకాలం విచారణ కొనసాగుతోందని తెలిపారు. అంతర్జాతీయ మావన హక్కుల చట్టాలకు అనుగుణంగా ఉపా చట్టంలో భారత్ మార్పులు చేయాలని కెనడా అభిప్రాయపడింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని (ఎఫ్సీఆర్ఏ) ప్రయోగిస్తూ, ఎన్జీవో సంస్థలకు ఇస్తున్న లైసెన్స్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని అమెరికా కోరింది. ఎఫ్సీఆర్ఏ, ఉపా చట్టాలపై సమీక్ష చేయాలని భారత్కు ఈస్తోనియా సూచించింది. జైల్లో నిర్బంధించిన హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం, లక్జెంబర్గ్ సూచించాయి. వాక్స్వాతంత్య్రం, నిరసన తెలిపే హక్కుకు అవకాశం కల్పించాలని లాటిన్ అమెరికా, యూరప్ దేశాలు అభిప్రాయపడ్డాయి. 2022 యూపీఆర్ సమావేశానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక మరికొద్ది వారాల్లో ఐరాస విడుదల చేయనున్నది.