Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన కార్యాచరణ అవశ్యమన్న జిన్‌పింగ్
- విభేదాలు పరిష్కరించుకోవాలన్న బైడెన్
- బాలి సదస్సులో నేతల భేటీ
బాలి : చైనా, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరు దేశాలు సరైన కార్యాచరణను రూపొందించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బాలిలో జీ-20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను ఆరోగ్యకరమైన, స్ధిరమైన అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించాల్సి వుందని అన్నారు. కాగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా కృషి జరగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్న తర్వాత ఈ 50ఏళ్ళకు పైగా కాలంలో చైనా, అమెరికాలు ఎన్నో ఒడిదుడుకులను, అవరోధాలను, అడ్డంకులను ఎదుర్కొన్నాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో నష్టాలూ లాభాలు వున్నాయి, అనుభవనాలు, గుణపాఠాలూ వున్నాయి. చరిత్ర అనేది అత్యుత్తమ పాఠ్య పుస్తకం, ఈ చరిత్రను ఒక రిఫరెన్స్‌గా తీసుకుని ఇరు దేశాలు భవిష్యత్ వైపు దృష్టి సారించాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. చైనా-అమెరికాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇరు దేశాల, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా లేవన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం అంచనాలకు, భావనలకు అనుగుణంగా వుందన్నారు. ప్రపంచంలోనే ప్రధానమైన రెండు దేశాల నేతలుగా, మనం చుక్కాని పట్టుకుని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధి కోసం సరైన దిశను కనుగొనాల్సి వుందని, సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి వుందని అన్నారు. రాజకీయ నేతలు తమ దేశ అభివృద్ధి పంథా గురించి, అలాగే ఇతర దేశాలతో, ప్రపంచంతో కలిసి ఎలా సాగాలనే విషయాన్ని ఆలోచించాలని జిన్‌పింగ్ పేర్కొన్నారు. చైనా, అమెరికాలు తమ సంబంధాలను సక్రమంగా నిర్వహించుకోవాలని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ఈనాటి మన సమావేశం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ శాంతి పట్ల ఆశను, అంతర్జాతీయ సుస్థిరత పట్ల విశ్వాసాన్ని, సమిష్టి అభివృద్ధి కోసం ఉత్తేజాన్ని కల్పించడం కోసం ఇతర దేశాలతో కలిసి మనం పనిచేయాలని కోరారు.
నేతల కరచాలనం
జిన్‌పింగ్, బైడెన్ ఇరువురు అధ్యక్షులుగా ఇలా సమావేశమవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు వీడియో సమావేశాలు, ఫోన్స్ కాల్స్ ద్వారానే మనం మాట్లాడుకున్నామని, ముఖాముఖిగా ఇప్పుడు ఇలా భేటీ కావడం బాగుందని జిన్‌పింగ్, బైడెన్‌తో వ్యాఖ్యానించారు. బాలిలోని విలాసవంతమైన హోటల్ ములియాలో బాల్రూమ్లో చైనా, అమెరికా పతాకాల ఎదురుగా ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. 'మేమిద్దం ఉపాధ్యక్షులుగా వున్నపుడు కలిసి చాలా సమయం గడిపాం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడడం సంతోషంగా వుంది.' అంటూ బైడెన్ వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక అంశాలు, కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూలంకషంగా చర్చలు కొనసాగించేందుకు ఇరువురు నేతలు సుముఖత వ్యక్తం చేశారు.
మన మధ్య వున్న విభేదాలను పరిష్కరించుకుని, పోటీ, ఘర్షణగా మారకుండా నివారిస్తూ, అత్యవసరమైన అంతర్జాతీయ అంశాలపై కలిసికట్టుగా కృషి చేసేందుకు మార్గాలన్వేషించాలని బైడెన్ ఆకాంక్షించారు. ఇందుకు పరస్పరం సహకారం అవసరమని అన్నారు. అంతకుముందు సోమవారం మధ్యాహ్నాం జిన్‌పింగ్ దంపతులు బాలికి చేరుకున్నారు. చైనా భాషలో స్వాగతం అంటూ విద్యార్ధులు వారికి ఇండోనేషియా సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ప్రధానంగా తైవాన్, ఉక్రెయిన్, ఉత్తర కొరియాలపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.