Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : ఆస్కార్‌కు ఎంపికైన ఓ సినిమాపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్థాన్ చిత్ర నిర్మాత సైమ్ సాదిక్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం 'జాయ్‌ల్యాండ్' విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో పాటు అమర్యాదకరంగా, నైతిక విలువలకు అసహ్యకరంగా ఉందంటూ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. అలీజునేజో, సానియా సయిద్, అలీనా ఖాన్, రస్తీ ఫరూఖ్, సర్వత్ గిలానీ, సొహైల్ సమీర్, సల్మాన్ పీర్జాదా నటించారు. పితృస్వామ్య భావాలు కలిగిన రాణా కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు హైదర్ ప్రేమ కథ. మగబిడ్డను కని తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలని తీవ్రంగా కోరుకునే అతను ట్రాన్స్‌వుమెన్‌తో ప్రేమలో పడి అక్కడి నృత్య థియేటర్లో చేరతాడు. ఈ చిత్రం అమెరికా ప్రతిష్టాత్మక పురస్కారం జ్యూరీ ప్రైజ్, ఈ ఏడాది కేన్స్ చిత్రోత్సవంలో క్వీర్ పామ్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే టోరంటో అంతర్జాతీయ చిత్స్రోవాలు, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. గతవారం జరిగిన ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ (ఎపిఎస్‌ఎ)లో యంగ్ సినిమా అవార్డును గెలుచుకుంది. ఆగస్ట్ 17న సెన్సార్ సర్టిఫికేట్ పొందినప్పటికీ.. తర్వాత నిర్ణయం మార్చబడిందని మంత్రిత్వ శాఖ నవంబర్ 11న విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. సమాజంలోని సామాజిక, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేదని, మరియు ఈ చిత్రం 1979లోని సెక్షన్ 9లో నిర్దేశించిన మర్యాద, నైతికత నిబంధనలను విరుద్ధంగా అభ్యంతరకరమైన అంశాలు కలిగి ఉన్నట్లు వ్రాతపూర్వక ఫిర్యాదు అందిందని ఆ నివేదికలో తెలిపింది. పైన పేర్కొన్న ఆర్డినెన్స్ లోని సెక్షన్ 9 (ఎ) అధికారాలను ఉపయోగించి, సమగ్ర విచారణ జరిపిన తర్వాత జారుల్యాండ్ అనే చిత్రాన్ని పాకిస్థాన్‌లో నిషేధిస్తున్నామని పేర్కొంది.
దీంతో ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ (సిబిఎఫ్‌సి) ధృవీకరించని చిత్రంగా గుర్తించామని.. సిబిఎఫ్‌సి నిబంధనలు వర్తించే థియేటర్ల్లో ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ నిషేధంపై చిత్ర దర్శకుడు సాదిక్ స్పందించారు. ఈ నిషేధం పూర్తిగా అన్యాయమని, రాజ్యాంగవిరుద్ధమని, అక్రమమని ట్వీట్ చేశారు. సినిమాను సెన్సార్‌బోర్డ్ అధికారులు ధృవీకరించారని అన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని 18వ సవరణ .. అన్ని ప్రావిన్స్‌లలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించిందని.. దీంతో కొందరు మితవాదుల ఒత్తిడితో తమ సినిమాపై నిషేధం విధించారని అన్నారు. వారు ఈ చిత్రాన్ని చూడకుండానే నిషేధం విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ నిషేధంపై పలువురు సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.