Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి-20 సదస్సులో ప్రధాని మోడీ పిలుపు
బాలి : దౌత్య మార్గాల ద్వారానే ఉక్రెయిన్ ఘర్షణలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ నొక్కి చెప్పారు. మంగళవారం ఇక్కడ జి-20 సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇంధన సరఫరాపై ఎలాంటి ఆంక్షలను ప్రోత్సహించరాదని అన్నారు. సుస్థిరతకు హామీ కల్పించాల్సి వుందని పిలుపిచ్చారు. వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్లో పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్యలు. ఇవన్నీ కలిపి ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించాయన్నారు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. దాంతో ప్రతి ఒక్క దేశంలోని సామాన్య పౌరుడు దెబ్బ తింటున్నాడని అన్నారు. ఆహారం, ఇంధన భద్రతపై జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని నిలువరించేందుకు సమిష్టి కృషి చేయాల్సిన, కృత నిశ్చయం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు వైపులా ఎదురు దెబ్బలను ఎదుర్కొనే ఆర్థిక సామర్ధ్యం పేద ప్రజలకు వుండదని అన్నారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి వంటి బహుళపక్ష సంస్థలు కూడా విఫలం చెందాయన్న అంశాన్ని మనం గుర్తించడానికి వెనుకాడరాదని అన్నారు. అవసరమైన సంస్కరణలు తీసుకురావడంలో మనం కూడా విఫలమయ్యాం, అందువల్ల ఈనాడు ఇక్కడ జరుగుతున్న జి-20 సదస్సు పట్ల యావత్ ప్రపంచానికి చాలా ఆశలు, ఆకాంక్షలు వున్నాయి. ఈ గ్రూపు కాలానుగుణ్యత మరింతగా ప్రాధాన్యతను సంతరించుకుందని మోడీ వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు దేశాధినేతల సమక్షంలో జి-20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్ను మోడీ ఆలింగనం చేసుకున్నారు.