Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 ఏండ్లలో వంద కోట్లు పెరిగింది : ఐరాస
- భారత్ వాటా 17.7 కోట్లు.. అతిపెద్ద వాటాదారు
- 1974లో ప్రపంచ జనాభా 400కోట్లు..
- 2023లో చైనాను దాటనున్న భారత్
ఐక్యరాజ్యసమితి : వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి ఫలితంగా ప్రపంచ జనాభా కొత్త మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి మీదున్న జనాల సంఖ్య 800కోట్లను తాకింది. మంగళవారం 800వ కోట్ల శిశువు ఈ భూమ్మీదకు వచ్చిందని ఐక్యరాజ్యసమితి ట్విట్టర్లో వెల్లడించింది. ''800 కోట్ల మంది ఆశలు. 800 కోట్ల కలలు. 800 కోట్ల అవకాశాలు. మన భూగ్రహం 800మందికి నిలయం గా ఉంది'' అంటూ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ పేర్కొన్నది. ప్రపంచ జనాభా ఈ మైలు రాయిని చేరుకోవటంలో అతిపెద్ద కాంట్రి బ్యూటర్ భారతేనని, పెరిగిన (100కోట్ల) జనాభాలో భారత్ వాటా 17.7 కోట్లుందని ఐరాస గణాంకాలు విడు దల చేసింది. తాజా పరిణామంపై ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ మాట్లాడుతూ, ''ఉన్న వారు, లేనివారి మధ్య అగాధాన్ని తగ్గించాలి. లేదంటే ఉద్రిక్తతలు, అపనమ్మకం, సంక్షోభం, సంఘర్షణలతో ప్రపంచం నిండుతుంది'' అని అన్నారు.
ఐదు దశాబ్దాల్లో రెట్టింపు..
48ఏండ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. 1974లో ప్రపంచ జనాభా 400కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గాయని, ఆయుర్దాయం పెరిగిందని, ప్రపంచ జనాభా గణనీయంగా పెరగటానికి ఇదే ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15ఏండ్లకు అంటే..2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరే అవకాశముందని అంచనావేసింది. 2023 నాటికి జనాభా విషయంలో చైనాను భారత్ దాటుతుందని, అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుం దని ఐరాస అంచనావేసింది. ప్రస్తుతం మనదేశ జనాభా 141.2 కోట్ల మేర ఉండగా, 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని తెలు స్తోంది. ఇక చైనా జనాభా ప్రస్తుతం 145.2 కోట్లుగా ఉంది. ఈ దేశ జనాభా 2050 నాటికి 130 కోట్లకు తగ్గొచ్చని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి విభాగం లెక్కలు గట్టింది.
ప్రపంచ జనాభా 200కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏండ్లు (1930 సంవత్సరంలో) పట్టింది. 300 కోట్ల మార్కును మరో 30ఏండ్లలో (1960నాటికి) అందుకుంది. ఆ తర్వాత 400 కోట్ల స్థాయికి 14ఏండ్లు (1974), 500 కోట్ల మార్కును తాకడానికి 13ఏండ్లు (1987) పట్టింది. 600 కోట్ల మైలురాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే (1998) మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏండ్లు (2010) పట్టింది. అటు తర్వాత మళ్లీ 12 ఏండ్లకు..(నవంబర్ 15, 2022 నాటికి) 800 కోట్ల మార్కును తాకింది.