Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న ఇండియా
- అందరినీ కలుపుకుని పోయే కార్యాచరణ : మోడీ
బాలి : రాబోయే సంవత్సరానికి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ ఈ బాధ్యతలను ప్రధాని నరేంద్రమోడీకి అప్పగించారు. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న జీ-20 సదస్సు సంయుక్త డిక్లరేషన్‌ను ఖరారుచేసిన అనంతరం బుధవారం బాధ్యతల అప్పగింత జరిగింది. 'ప్రతి ఒక్క దేశం కృషితో అంతర్జాతీయ సంక్షేమానికి ఒక ఉత్ప్రేరకంగా జీ-20 సదస్సును రూపొందించాలి.'' అని మోడీ అన్నారు. జీ-20కి భారత్ అధ్యక్షత వహించే పదవీకాలంలో అందరినీ కలుపుకుని పోయేలా, బృహత్తరంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణతో కూడి వుంటుందని మోడీ ప్రకటించారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో, ఆర్థిక మాంద్యంతో, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ బాధ్యతలను చేపట్టామని మోడీ పేర్కొన్నారు. ఈ బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని, వివిధ నగరాలు, రాష్ట్రాల్లో జీ-20 సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశం యొక్క అద్భుతమైన వైవిధ్యం, సాంప్రదాయాలు, సాంస్కృతిక సుసంపన్నతలను అతిథులకు అనుభవంలోకి తెస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి మాతృక వంటి భారతదేశంలో విశిష్టంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. నూతన ఆలోచనలతో, సమిష్టి కార్యాచరణను మరింత వేగవంతం చేసేందుకు జీ-20 కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే జి-20 సదస్సుకు అనుసరించబోయే థీమ్‌లో 'అభివృద్ధి కోసం డేటా' అన్న సిద్ధాంతం అంతర్భాగంగా వుంటుందని మోడీ చెప్పారు. బాలి సదస్సు సందర్భంగా డిజిటల్ పరివర్తనపై వర్కింగ్ సెషన్లో ప్రధాని మోడీ, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో, ఇతర ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ''మన శకంలో డిజిటల్ పరివర్తన అనేది అత్యంత గణనీయమైన మార్పు. డిజిటల్ సాంకేతికతలను సక్రమంగా ఉపయోగించుకుంటే రాబోయే దశాబ్దాల కాలంలో పలు రెట్ల శక్తిగా మారగలదు.'' అని మోడీ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై పోరాడడంలో కూడా డిజిటల్ పరిష్కారమనేది ఉపయుక్తంగా వుంటుందన్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని జి-20 సదస్సు ఖండించింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ నేతలు బుధవారం సంయుక్త డిక్లరేషన్‌ను ఆమోదించారు. యుద్ధాన్ని మెజారిటీ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయని, ఇతరత్రా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని ఆ డిక్లరేషన్ పేర్కొంది. భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించుకునేం దుకు జి-20 సరైన వేదిక కాదని డిక్లరేషన్ పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించాలని కోరింది. అణ్వాయుధాల వినియోగం ముప్పును ఖండించింది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లకు తరలి వెళ్లాల్సిన గోధుమలు వంటి ఆహార ధాన్యాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో నల్ల సముద్రం ద్వారా తరలించేందుకు చేపట్టిన చొరవను సమావేశం స్వాగతించింది.
జర్మనీతో సహకార విస్తరణపై మోడీ చర్చలు
జర్మనీ ఛాన్సలర్ ఓల్ప్ షుల్జుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఆర్థిక కార్యకలాపాలను, రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు గల అవకాశాలను ఇరువురు నేతలు పరిశీలించారు. జర్మనీ ఛాన్సలర్‌ను కలుసుకోవడం ఆనందంగా వుందని మోడీ ట్వీట్ చేశారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. రక్షణ, భద్రత, వలసలు, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి పలురంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు, వాణిజ్య, పెట్టుబడులను మరింతగా అభివృద్ధి చేసుకునేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.