Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : మానవ సహిత రోదసీయాన మిషన్‌లో భాగంగా షెంఝూ-14 వ్యోమగాములు గురువారం మూడోసారి రోదసీలో నడిచారు. ఈ నెల 3న చైనా రోదసీ స్టేషన్ మౌలిక నిర్మాణ కూర్పు పూర్తయింది. ఆ తర్వాత మొదటిసారిగా అంతరిక్ష నౌక నుండి బయటకు వచ్చిన వ్యోమగాములు అంతరిక్షంలో నడిచారు. ఉదయం 11.16 గంటల సమయంలో, వ్యోమగాములు విజయవంతంగా ఎయిర్‌లాక్‌ను తెరిచారు. షెంఝూ-14 మిషన్ కమాండర్ చెన్ డాంగ్ కేబిన్ నుండి ముందుగా బయటకు వచ్చారు. చెన్ను సహచర సభ్యుడు కారు జూడాంగ్ అనుసరించారు. వారిద్దరు అంతరిక్షంలో అడుగులు వేస్తుండగా, ఏకైక మహిళా వ్యోమగామి లియూ యాంగ్ కేబిన్ లోపల వుండి వారికి సహకరించారని చైనా రోదసీ సంస్థ ప్రకటించింది. వెంతియాన్ ల్యాబ్ మాడ్యూల్‌పై పనోరమ కెమెరా ఎత్తును పెంచడం, భవిష్యత్తులో రోదసీలో నడిచేందుకు వీలు కల్పించేందుకు రోదసీ స్టేషన్ మాడ్యూల్స్‌కు పరికరాలను బిగించడం వంటి పనులు వారు చేస్తారని భావిస్తున్నారు. వీరి కార్యకలాపాల్లో పెద్ద, చిన్న రొబొటిక్ ఆర్మ్లను తొలిసారిగా ఉపయోగిస్తున్నారు.