Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లండన్ : పన్నులను పెంచుతూ, ప్రభుత్వ వ్యయంపై పట్టు బిగిస్తూ బ్రిటన్ ఆర్థిక మంత్రి జెరిమీ హంట్ గురువారం కఠినమైన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మాంద్యంలో వుందని పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన చెప్పారు. వచ్చే ఏడాదికి ఆర్థిక వ్యవస్థ మరింత కుంచింకుపోయే అవకాశాలు వున్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో బాధాకరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోక తప్పలేదన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లు తిరిగి పునరుద్ధరించబడాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. ''విశ్వసనీయత దానంతట అదే రాదు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి మనం నిరంతరంగా కృషి చేస్తూనే వుండాలని నిన్నటి ద్రవ్యోల్బణ గణాంకాలు చెబుతున్నాయి.'' అని ఆయన పేర్కొన్నారు. పన్ను నిబంధనల్లో మార్పులను మంత్రి ప్రకటించారు. ఈ మార్పుల కారణంగా మరింతమంది మౌలిక ఆదాయపన్ను చెల్లించాల్సి వుంటుంది. డివిడెండ్లు నుండి వచ్చే ఆదాయాలపై పన్ను రహిత అలవెన్సుల్లో కోత విధించారు. కంపెనీలు చెల్లించే సామాజిక భద్రతా చెల్లింపులను మరింతగా పెంచారు. జనవరి 1 నుండి ఇంధన కంపెనీల లాభాలపై లెవీని ప్రస్తుతమున్న 25శాతం నుండి 35శాతానికి పెంచారు. 2028 వరకు ఇదే పరిస్థితి అమల్లో వుంటుందన్నారు. విద్యుత్ జనరేటర్లపై కొత్తగా తాత్కాలికంగా 45శాతం పన్ను విధించనున్నారు. వచ్చే ఏడాదికల్లా 1400కోట్ల పౌండ్లను సమీకరించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్లో ద్రవ్యోల్బణం రేటు 11శాతానికి పైగా వుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.