Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ రిసార్టులో ఈ నెల 6 నుంచి జరుగుతున్న కాప్ 27 చర్చలు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో గురువారం వాతావరణ ఒప్పందం మొదటి ముసాయిదాను ఐక్యరాజ్య సమితి ప్రచురించింది. అన్ని శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా నిర్మూలించే విషయాన్ని ఈ ముసాయిదాలో ప్రస్తావించలేదు. కేవలం బొగ్గునే కాకుండా అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించే నిర్ణయం చేయాలని భారత్ తొలుత ప్రతిపాదించగా, యురోపియన్ యూనియన్, ఇంకా పలు దేశాలు సమర్ధించాయి.
అడ్డూ అదుపు లేకుండా వాడుతున్న బొగ్గును దశలవారీగా ఎత్తివేసే దిశగా చర్యలను వేగవంతం చేసేందుకు నిరంతరంగా కృషి జరగాలని, ఆ కృషిని ప్రోత్సహించాలని ముసాయిదా పేర్కొంది. జాతీయ పరిస్థితులకు అనుగుణంగా, సమర్ధవంతంగా లేని శిలాజ ఇంధనాల సబ్సిడీలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది. పరివర్తనల దిశగా మద్దతునివ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలని పేర్కొంది. గతేడాది గ్లాస్గో వాతావరణ ఒప్పందంలోనూ దాదాపు ఇదే భాషను ఉపయోగించారు.
దీనిపై భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధిని సంప్రదించగా, ఇంకా చర్చలు కొనసాగుతున్నందున దీనిపై వ్యాఖ్యానించాలనుకోవడం లేదని చెప్పారు.
ప్రస్తుత వాతావరణ చర్చల్లో ప్రధానంగా చర్చించబడిన నష్టపరిహారాన్ని ఇచ్చే సదుపాయాన్ని ఎప్పటి నుండి ప్రారంభిస్తారు, అందులోని ప్రామాణికాలేంటనే అంశాన్ని కూడా ఆ ముసాయిదాలో పేర్కొనలేదు.
నష్టపరిహారం అంశాన్ని పరిష్కరించడం కోసం ఒక నిధిని ప్రారంభించాలన్న నిర్ణయంతో కాప్ 27 సమావేశం ముగియాలని పేద, వర్ధమాన దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. సంపన్న దేశాలు వెలువరించే కాలుష్యాల ప్రభావం ప్రధానంగా తమవంటి చిన్న, నిరుపేద దేశాలపై వుంటోందని, ఫలితంగా ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్నామని, అందువల్ల ఆ నష్టాల భారాన్ని సంపన్నదేశాలే భరించాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా వుంది.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెంపు 2డిగ్రీల సెల్సియస్‌కు దిగువగానే వుంచేలా చూడాలంటూ పారిస్ ఒప్పందంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని స్థాయిల్లో కృషి జరగాలని, దీనికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ఆ ముసాయిదా పేర్కొంది. 20పేజీలతో వెలువడిన ఈ ముసాయిదా పత్రంలో 8400 పదాలు వున్నాయి. గ్లాస్గో ఒప్పందంలో దాదాపు 4600 పదాలే వున్నాయి.