Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 56మంది మృతి..700మందికిపైగా క్షతగాత్రులు
- రిక్టర్ స్కేల్‌పై 5.6 నమోదు
- ప్రకంపనల ధాటికి వణికిపోయిన జావా ద్వీపం
న్యూఢిల్లీ : ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. సియాంజర్ ప్రాంతంలో 49 సెకన్లపాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి 56 మంది మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించాయి. వేలాది మంది గాయపడ్డారని, క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో నమోదైన ప్రకంపనల ధాటికి దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది. ప్రజలు భయంతో ఇండ్లు, అపార్ట్మెంట్లు, కార్యాలయాలు నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా సియాంజుర్ పట్టణంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని వార్తలు వెలువడ్డాయి. మరో 700మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి వందలాది ఇండ్లు, ఇతర నిర్మాణాలు ధ్వంసం కావడంతో శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టు సియాంజుర్ పాలనాధికారి హెర్మన్ సుహెర్మాన్ ఓ వార్తా సంస్థతో తెలిపారు.
సియాంజుర్ పట్టణం..దేశ రాజధాని జకార్తాకు ఆగేయ దిశలో 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వాతావరణ, జియోఫిజిక్స్ సంస్థ 'బీఎంకేజీ' వెల్లడించింది. భూకంపం అనంతరం కూడా ఇక్కడ 25 సార్లు భూమి కంపించినట్టు (ప్రకంపనలు) పేర్కొన్నది. ఈ నేపథ్యంలో..ప్రకంపనల సమయంలో ప్రజలు ఆరు బయటే ఉండాలని బీఎంకేజీ చీఫ్ ద్వికోరిటా కర్ణావతి సూచనలు చేశారు. మరోవైపు..జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక ఇండ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని..నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.