Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38మంది మృతి
బీజింగ్ : సెంట్రల్ చైనాలోని ఫ్యాక్టరీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 38మంది మరణించారని ప్రభుత్వ మీడియా మంగళవారం తెలిపింది. కార్మికులు అక్రమంగా వెల్డింగ్ చేయడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. హెనన్ ప్రావిన్స్‌లోని అనయంగ్ నగరంలో ఒక ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అలారం మోగిన వెంటనే మున్సిపల్ అగ్నిమాపక దళం అధికారులు స్థానిక కాలమానం ప్రకారం 4.22 గంటలకు ప్లాంట్‌కి వెళ్ళారని మీడియా తెలిపింది. రెండు అగ్నిమాపక శకటాలు ఆరు గంటల పాటు శ్రమించి 11గంటల సమయంలో మంటలనుఅదుపులోకి తెచ్చాయి. ఫ్యాక్టరీ వున్న ప్రాంతమంతా దట్టమైన నల్లని పొగ అలుముకున్నట్లు సీసీటీవీ ఫుటేజీతో తెలుస్తోంది. కాగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయమేమీ లేదని పీపుల్స్ డైలీ పత్రిక తెలిపింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించి కార్మికులు ఎలక్ట్రిక్ వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని స్థానిక అధికారులను ఉటంకిస్తూ సిసిటివి తెలిపింది. ప్రమాద రహితమైన రసాయనాలు, దుస్తులు, అగ్నిమాపక పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, యంత్రాలు వంటి వాటిని టోకుగా విక్రయించే ఫ్యాక్టరీ అది.