Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 268కి చేరిన మృతుల సంఖ్య
- 151 మంది ఆచూకీ గల్లంతు!
- కూలిన భవనాల కింద అనేకమంది !
జకార్తా : ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి చేరుకుంది. వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అత్యధిక జనాభా కలిగిన జావా ద్వీపంలో భూకంపం సంభవించటం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 268మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు మంగళవారం వెల్లడించారు. భవన శిథిలాల కింద మరిన్ని మృతదేహాలను గుర్తించారు. మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడగా..600 మంది కి స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. ఇంకా 151 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రాజధాని జకార్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాంజుర్ కేంద్రంగా 5.6 తీవ్రతతో సోమవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు చియాంజుర్ ప్రాంతం తీవ్రంగా ధ్వంస మైంది. భవనాలు కూలిపోయి అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. క్షతగాత్రులతో స్థానిక హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. దీంతో చాలా మందికి ఆరు బయటే చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని తెలుస్తోంది. ఇండోనేషియాలో చాలామంది విద్యార్థులు సాధారణ తరగతులు ముగిసన తర్వాత ఇస్లామిక్ పాఠశాలల్లో అదనపు తరగతులకు హాజరవుతారు. ఈ విపత్తుతో సియాంజుర్ ప్రాంతంలో 13వేల మంది నిరాశ్రయులయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మంగళవారం పరిశీలించారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
ఇండోనేషియా భూకంప ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండోనేషియాకు భారత్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.